ఏలూరు జిల్లాలో.. బాణసంచా తయారీ కేంద్రాలు లేవు. మందుగుండు సామగ్రి నిల్వ కేంద్రాలు 9 వరకు ఉన్నాయి. ఏలూరు జాతీయ రహదారిపై రత్నాస్ డాబా వద్ద ఒక నిల్వ కేంద్రం, నూజివీడులో రెండు, చింతలపూడిలో ఒకటి, భీమడోలులో మూడు, పల్లెర్లమూడిలో భారీ మందుగుండు సామగ్రి నిల్వ కేంద్రం ఉంది. జంగారెడ్డిగూడెంలో బాణసంచా నిల్వ చేసే కేంద్రాలు ఉన్నాయి. ఇక పలువురు బాణసంచా విక్రయ కేంద్రాలు నిర్వహించే వ్యక్తులు నిల్వలను అక్రమంగా ఇళ్లల్లోనే గుట్టుచప్పుడు కాకుండా ఉంచినట్టు సమాచారం.
పశ్చిమగోదావరి జిల్లాలో.. బాణసంచా విక్రయ కేంద్రాలు సుమారు 45 వరకు ఉన్నాయి. తాడేపల్లిగూడెంలో నిల్వ కేంద్రాలు అధికారికంగా ఐదు, అనధికారికంగా 10కి పైగా ఉన్నాయి. బాణసంచా కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవటంతో పేలుడు సంభవిస్తే ప్రాణనష్టం తీవ్రంగా ఉంటుంది. భారీఎత్తున మందుగుండు సామగ్రి నిల్వ చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవటంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.


