పరిష్కార వేదికకు సమస్యల వెల్లువ | - | Sakshi
Sakshi News home page

పరిష్కార వేదికకు సమస్యల వెల్లువ

Mar 3 2026 7:16 AM | Updated on Mar 3 2026 7:16 AM

పరిష్కార వేదికకు సమస్యల వెల్లువ

రొయ్యల ఫ్యాక్టరీతో కాలుష్యం

భీమవరం(ప్రకాశం చౌక్‌): భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన జిల్లాస్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)కు సమస్యలు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూల నుంచి పలువురు తరలివచ్చి అర్జీలు సమర్పించారు. కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి అర్జీలను స్వీకరించి సత్వర పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. భూ సంబంధిత సమస్యలు, పెన్షన్లు, ఇళ్ల మంజూరు, ఆరోగ్య అంశాలకు సంబంధించిన అర్జీలు ఎక్కువగా వచ్చాయి. జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో బి.శివన్నారాయణరెడ్డి, జిల్లా సచివాలయం అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పీడీ కేసీహెచ్‌ అప్పారావు, కలెక్టరేట్‌ ఏఓ ఎన్‌.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

అర్జీల్లో కొన్ని..

● ఇరగవరం మండలం పేకేరుకు చెందిన దివ్యాంగురాలు బుద్దా విమల రూ.15 వేల పింఛన్‌ కోసం అర్జీ అందించారు.

● భీమవరం 10వ వార్డుకు చెందిన నున్న రాజశేఖర్‌ నడవ లేని స్థితిలో ఉన్నానని రూ.15 వేల పింఛన్‌, ట్రై సైకిల్‌ ఇప్పించాలని కోరారు.

● భీమవరం మండలం గుట్లపాడులో అనుమతులు లేకుండా పంచాయతీ చెరువు గట్టుపై ఆలయం నిర్మిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని కొందరు గ్రామస్తులు వినతిపత్రం అందించారు.

● తణుకు మండలం వేల్పూరుకి చెందిన ఇవ్వల సత్యనారాయణ గ్రామంలో తనకు 40 సెంట్ల వ్యవసాయ భూమి ఉందని, అడంగల్‌లో గడ్డి భూమిగా నమోదైందని, సరిచేసి పాస్‌బుక్‌ ఇప్పించాలని అభ్యర్థించారు.

● కాళ్ల మండలం పెదఅమిరం గ్రామానికి చెందిన సోడదాసి లీలమ్మ అర్జీ సమర్పిస్తూ రేషన్‌ కార్డు మంజూరు చేయాలని కోరారు. పంచాయతీ కార్యాలయంలో సమాధానం చెప్పడం లేదని ఫిర్యాదు చేశారు.

● భీమవరం మండలం జొన్నలగరువుకి చెందిన గోరం చిన్న సామేలు (62) తనకు మూడేళ్ల క్రితం గుండె ఆపరేషన్‌ జరిగిందని, ఎలాంటి ఆదాయం లేదని వృద్ధాప్య పింఛన్‌ ఇప్పించాలని వినతిపత్రం సమర్పించారు.

భీమవరం మండలం యనమదుర్రు పరిధిలోని డేగాపురంలో రొయ్యల వలుపు ఫ్యాక్టరీని నిలుపుదల చేయించాలని గ్రామానికి చెందిన మహిళలు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఓ వ్యక్తి ఈ ఫ్యాక్టరీ పెట్టడానికి ప్రయత్నించగా తాము అడ్డుకున్నామని, రాజకీయ పలుకుబడితో మరలా నిర్మాణ పనులు ప్రారంభించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రశ్నిస్తే దిక్కున్న చోట చెప్పుకోమని దౌ ర్జన్యానికి దిగుతున్నాడని వాపోయారు. ఆ ఫ్యాక్టరీ వల్ల తాగు, సాగునీటి ఇబ్బందులతో పాటు వా యు కాలుష్యం తలెత్తుతుందని ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement