క్రీస్తు పట్ల విశ్వాసం ఉంచాలి | - | Sakshi
Sakshi News home page

క్రీస్తు పట్ల విశ్వాసం ఉంచాలి

Mar 2 2026 7:15 AM | Updated on Mar 2 2026 7:15 AM

క్రీస్తు పట్ల విశ్వాసం ఉంచాలి

క్రీస్తు పట్ల విశ్వాసం ఉంచాలి

నూజివీడు: ఏసుక్రీస్తును విశ్వసించిన వారికి నాశనం లేదని, మనందరిని పాపాల నుంచి విముక్తులను చేసేందుకే క్రీస్తు ఈ లోకానికి వచ్చారన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని విజయవాడ మేత్రాసన పీఠాధిపతులు మహాఘన తెలగతోటి జోసెఫ్‌ రాజారావు అన్నారు. నూజివీడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శిలువగట్టు తిరునాళ్లు శనివారం రాత్రితో ముగిశాయి. ముగింపు మహోత్సవ వేడుకలకు విజయవాడ పీఠాధిపతులు ప్రధాన అతిథిగా విచ్చేసి పవిత్ర దివ్య బలిపూజను సమర్పించారు. అనంతరం భక్తులనుద్దేశించి పీఠాధిపతి మాట్లాడుతూ ప్రేమ స్వరూపి ఏసు కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. మరణాన్ని సైతం జయించి క్రీస్తు మనందరికీ ఆరాధ్యుడయ్యారని ఆయన వివరించారు. శిలువపై మృతిచెందిన ఏసుక్రీస్తు పట్ల ప్రతి ఒక్కరూ విశ్వాసాన్ని ఉంచాలని, అప్పుడే శిలువ ప్రతి క్రీస్తు సోదరుడికి బలాన్ని, రక్షణను, శక్తిని ఇస్తుందన్నారు. విద్వేషాలు, అసత్యం, అధర్మం, హింస వంటి వాటిని కలిగి ఉంటే క్రీస్తులో ఐక్యం కాలేరని, వాటన్నింటిని వదిలేస్తేనే క్రీస్తు మోక్షం లభిస్తుందన్నారు. పేదవారిపట్ల, బలహీనులపట్ల దయాగుణం కలిగి ఉండాలన్నారు.

పుణ్యక్షేత్ర విశిష్టత

శిలువగట్టు పుణ్యక్షేత్ర విశిష్టతను వివరిస్తూ.. ఈ కొండపై పవిత్ర శిలువను ప్రతిష్టించి, ఈ ప్రాంతాన్ని ఒక అద్భుత ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దిన ఫాదర్‌ జాన్‌ లియోంచని కృషిని పీఠాధిపతులు గుర్తుచేశారు. బైబిల్‌లోని అనేక పవిత్ర వాక్యాలను, అర్థవంతమైన ఉపమానాలను ఉదహరిస్తూ ఆయన ఇచ్చిన సందేశం క్రీస్తు సోదరుల హృదయాలను హత్తుకుంది. ఈ పవిత్ర బలిపూజ కార్యక్రమంలో పలువురు గురువులు, వేలాది మంది భక్తులు పాల్గొని పునీతులయ్యారు. తిరునాళ్ల ముగింపు సందర్భంగా శిలువగట్టు పరిసర ప్రాంతాలన్నీ భక్తుల జయ జయఽ ధ్వానాలతో మార్మోగాయి. మరియదళ సభ్యులు క్రైస్తవ గీతాలు ఆలపించారు.

విజయవాడ పీఠాధిపతులు జోసెఫ్‌ రాజారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement