పశువుల్లో గాలికుంటుతో అప్రమత్తం
పాలకొల్లు సెంట్రల్: పశువులకు వచ్చే గాలికుంటు వ్యాధి పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా టీకాలు వేయించాలి. ఈ వ్యాధి ప్రాణాంతకం కాకపోయినా అశ్రద్ద వహిస్తే పశువుల ఆరోగ్యం నెమ్మదిగా క్షీణించుకుపోయే ప్రమాదం ఉంటుందని పశు వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి వైరస్ ద్వారా వ్యాపిస్తోంది. చాలా వేగంగా సోకుతుంది. గాలి, నీరు, దాణా, మనుషుల ద్వారా కూడా వ్యాపించే గుణం ఉంటుంది.
గాలి కుంటు వ్యాధి లక్షణాలు
ఈ వ్యాధి సోకితే పశువులకు 103 నుంచి 106 జ్వరం వస్తుంది. నోటిలో, కాలి గిట్టల్లో పుండ్లు ఏర్పడతాయి. నోటి నుంచి చొంగ కారుతుంది. దానివల్ల పశువులు ఆహారాన్ని తినే పరిస్థితి ఉండదు. ఈ వ్యాధి పట్ల అశ్రద్ద వహిస్తే మరింత ముదిరిపోతుంది. వ్యాధి ముదిరితే పాల ఉత్పతత్తి తగ్గిపోతుంది. దీనిని అరికట్టడం కోసం సంవత్సరానికి రెండు సార్లు టీకాలు వేయించాలి.
నివారణ చర్యలు
సకాలంలో టీకాలు వేయించాలి. 3 నెలలు దాటిన అన్ని పశువులకు ఈ టీకాలు వేయొచ్చు. చూడితో ఉన్న పశువులకు సైతం ఈ టీకాలు వేయించవచ్చు. వ్యాధి సోకిన వెంటనే పెయిన్ కిల్లర్లు, బి కాంప్లెక్స్ ఇంజక్షన్‌లు ఇవ్వాలి. నోటిలో పుండ్లు ఏర్పడడం వల్ల దాణా తినలేక ఇబ్బందులు పడుతుంటాయి. అందువల్ల అంబలి, జొన్నలతో జావ లాంటివి పట్టించాలి. వ్యాధి సోకిన వాటిని పశువుల మంద నుంచి వేరుచేసి దూరంగా ఉంచాలి. వాటి పాల నుంచి దూడలను దూరంగా ఉంచాలి. అలాగే పసుపు, మంచి నూనె కలిపి ముద్దలుగా చేసి నోటిలో పుండ్లు ఏర్పడిన చోట రుద్దాలి. ఈ వ్యాధి వల్ల పాల ఉత్పత్తి తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల రైతులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వ్యాధి నివారణ పట్ల అప్రమత్తంగా ఉండాలి పశువైద్యులు సూచిస్తున్నారు.
పశువుల్లో గాలికుంటుతో అప్రమత్తం
పశువుల్లో గాలికుంటుతో అప్రమత్తం


