సేంద్రియ సాగుతో ఆరోగ్యానికి భరోసా
ఇది ఒక యజ్ఞం లాంటిది
రైతులకు అవగాహన కల్పిస్తున్నాం
కొయ్యలగూడెం: మారుతున్న కాలంలో ప్రాణాంతక రోగాలకు ప్రధాన కారణాల్లో ఎరువులు, పురుగు మందులు వాడుతున్న ఆహారం ఒకటి. దీంతో ప్రకృతి వ్యవసాయ సాగు పద్ధతిపై ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. సేంద్రియ వ్యవసాయ సాగు పద్ధతులపై దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్ (ఏపీసీఎన్‌ఎఫ్) ఆధ్వర్యంలో బీఆర్పీ యజమానులకు (బయో రిసోర్స్ సెంటర్) యజమానులకు విడతల వారీగా శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని రైతు సాధికారిక సంస్థ చేపట్టింది. బయో ఇన్‌ఫుట్స్ తయారీపై శిక్షణ కార్యక్రమంలో భాగంగా కొయ్యలగూడెం మండలంలోని బయ్యన్నగూడెం సాయికృష్ణ గోసాల ప్రకృతి ఉత్పత్తుల శిక్షణ కేంద్రంలో బృందానికి 40 నుంచి 60 మంది చొప్పున ఇప్పటికీ మూడు దశలుగా శిక్షణ ఇచ్చారు. రాష్ట్రంలో ఇంతవరకు 17,400 మందికి శిక్షణ ఇచ్చినట్లు స్టేట్ ప్రాజెక్టు మేనేజర్ మన్‌మోహన్ పేర్కొన్నారు. రసాయనిక ఎరువుల విషవలయం నుంచి భూ తల్లిని కాపాడుకుంటూ, పెట్టుబడి లేని సేద్యంతో అన్నదాతను ఆత్మగౌరవంతో నిలబెట్టడమే లక్ష్యంగా రైతు సాధికారిక సంస్థ అడుగులు వేస్తోంది. గోవును కేవలం పశువుగా కాకుండా, వ్యవసాయానికి ఊపిరిగా భావించాలి అనేది రైతు సాధికారిక సంస్థ ముఖ్య ఉద్దేశం.
రైతు సాధికారిక సంస్థ (ఆర్‌వైఎస్‌ఎస్) ప్రధాన ఆశయాలు
● రైతును రాజును చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్న ఈ సంస్థ, కేవలం ఆర్థిక సహకారానికే పరిమితం కాకుండా, సాగు పద్ధతుల్లో విప్లవాత్మక మార్పులు తెస్తోంది.
● ఖరీదైన రసాయనాలు, పురుగుమందులు కొనాల్సిన అవసరం లేకుండా, స్థానికంగా దొరికే వనరులతో సాగు చేసేలా రైతును సిద్ధం చేయడం.
● భూమిలో సారాన్ని పెంచి, జీవ వైవిధ్యాన్ని కాపాడటం. రసాయనాల వాడకం తగ్గించి భావి తరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారాన్ని అందించడం.
● సాగు ఖర్చును గణనీయంగా తగ్గించి, నికర లాభాన్ని పెంచడం
● సమాజానికి విషరహితమైన, పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించడం.
● ప్రకృతి వ్యవసాయ ప్రచారంలో మహిళలను భాగస్వాములను చేస్తూ, వారిని క్షేత్రస్థాయిలో కార్యోన్ముఖులను చేయడం.
గో ఆధారిత సేంద్రియ ఎరువులు
గోమాతను వ్యవసాయానికి కేంద్రబిందువుగా మార్చినప్పుడు సాగు ఖర్చు సున్నాకు చేరుతుంది. గో మూత్రం, పేడలో కోట్లాది సూక్ష్మజీవులు ఉంటాయని అవి పైరుకు మేలు చ్తేస్తాయంటున్నారు. సేంద్రీయ పద్ధతుల ద్వారా సాగు చేయడం వల్ల నేల భౌతిక స్థితి మారుతుంది. రసాయనాల వల్ల గట్టిపడిపోయిన భూమి, సేంద్రీయ ఎరువుల వాడకం వల్ల గుల్లబారి, గాలి ఆడేలా మారుతుంది. ఇది వేళ్ల వ్యవస్థ బలంగా పెరగడానికి దోహదపడుతుంది. గోమాతను నమ్ముకున్న రైతు ఎన్నడూ ఓడిపోడని ప్రకృతి ఒడిలో సాగు చేయడం వల్ల అటు భూమికి సారం, ఇటు రైతుకు లాభం, సమాజానికి ఆరోగ్యం దక్కుతాయని గోసాల ఉత్పత్తుల కేంద్ర నిర్వాహకుడు సుంకర సత్తిరాజు పేర్కొంటున్నారు.
సత్ఫలితాలిస్తున్న ఏపీసీఎన్‌ఎఫ్ పథకం
రైతు సాధికారిక సంస్థ చేస్తున్న ఈ ప్రయత్నం ఒక యజ్ఞం లాంటిది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో గోవు పాత్ర మరువలేనిది. ప్రతి రైతు తన పొలంలో ఒక మూల గోశాలను ఏర్పాటు చేసుకుని, సొంతంగా ఎరువులు తయారు చేసుకున్నప్పుడే అసలైన స్వయం సమృద్ధి సాధ్యమవుతుంది.
–కందుకూరి మన్‌మోహన్, రైతు సాధికారిక సంస్థ ప్రాజెక్టు మేనేజర్
బీఆర్‌సీ సెంటర్‌ను ఏర్పాటు చేసుకుని ఓ వైపు సేంద్రీయ వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తూనే, మరోవైపు కౌలు పొలం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నాను. భావితరాలలో సేంద్రీయ సాగు పద్ధతులు మరింత పెరుగుతాయి.
–చిరుకూరి కృష్ణవేణి, కాండ్రేగుల, కాకినాడ జిల్లా
సేంద్రియ సాగుతో ఆరోగ్యానికి భరోసా
సేంద్రియ సాగుతో ఆరోగ్యానికి భరోసా
సేంద్రియ సాగుతో ఆరోగ్యానికి భరోసా


