తాళం వేసిన ఇంట్లో చోరీ
నరసాపురం రూరల్: మండలంలోని కంసాలిబేతపూడిలో తాళం వేసి ఉన్న ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. బీరువా పగులగొట్టి సుమారు 4.5 కాసుల బంగారు ఆభరణాలు, 200 గ్రాముల వెండి వస్తువులు అపహరించుకుపోయారు. పోలీసుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పాలి నాగేశ్వరరావు అనారోగ్యం కారణంగా చికిత్స నిమిత్తం తన భార్యతో కలిసి గత నెల 27న పాలకొల్లు వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం దగ్గులూరులోని కుమార్తె ఇంటికి వెళ్లారు. శనివారం ఉదయం తిరిగి ఇంటికి చేరుకునేసరికి, ఇంటి ప్రధాన ద్వారం తలుపులు పగులగొట్టి ఉండడాన్ని గమనించారు. లోపలికి వెళ్లి చూడగా, బీరువా, అల్మారాలు పగులగొట్టి సామాన్లు అస్తవ్యస్తంగా పడేశారు. బీరువాలో భద్రపరిచిన 36 గ్రాముల బంగారం వస్తువులు, 13 జతల వెండి పట్టీలు మాయమైనట్లు బాధితులు గుర్తించారు. బాధితుడు పాలి నాగేశ్వరరావు నరసాపురం రూరల్ పోలీస్ స్టేషనన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై టి.వెంకట సురేష్ తెలిపారు.
ద్వారకాతిరుమల: చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని మంగళవారం జిల్లాలోని అన్ని ఆలయాలు మూతపడనున్నాయి. అందులో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ప్రధాన ఆలయంతో పాటు, ఉప, దత్తత ఆలయాలను సైతం ఉదయం 6.20 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు మూసివేస్తామని ఆలయ ఈఓ యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. ఆ రోజు ఉదయం 6.20 గంటల లోపు అర్చకులు స్వామివారి ప్రాతః కాలార్చనాదికాలను ముగించి, ఆలయ ద్వారాలు మూసివేస్తారన్నారు. తిరిగి రాత్రి 7.30 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి, ఏకాంతంగా శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. 4న యథావిధిగా ఆలయంలో నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలు, దర్శనాలు జరుగుతాయని ఈఓ తెలిపారు.
ముదినేపల్లి రూరల్ : ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్లోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి భారీసంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారి పుట్టలో పాలు పోసి స్వామివారిని దర్శించుకున్నారు. పాలపొంగళ్ల శాల వద్ద మహిళలు నైవేద్యాలు తయారుచేసి స్వామికి సమర్పించారు. నాగబంధాల వద్ద స్వామివారి మూర్తులను ప్రతిష్ఠించేందుకు అర్చకులతో పూజలు చేయించి ప్రతిష్ఠ తంతు నిర్వహించారు. నాగబంధాల వద్ద, గోకులంలోని గోవులకు మహిళలు పసుపు కుంకుమలతో పూజలు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాద ఏర్పాట్లు చేశారు. అన్నదాన కార్యక్రమానికి భక్తలు పోటెత్తడంతో ఆలయ సహాయ కమిషనర్ ఆర్.గంగాశ్రీదేవి ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు.
ద్వారకాతిరుమల: కోలాటం అంటే భక్తి, ఐక్యత, క్రమశిక్షణ, సమన్వయంతో కూడిన పవిత్ర కళారూపమని శ్రీవారి దేవస్థానం డిప్యుటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ టి.సూర్యనారాయణ అన్నారు. వట్లూరుకు చెందిన శ్రీ వెంకట లక్ష్మి నందన కోలాట భజన మండలి, శ్రీ వెంకట విజయ నందన కోలాట భజన మండలి సభ్యులు తమ తొలి ప్రదర్శనను శ్రీహరి కళాతోరణ వేదికపై ఆదివారం ప్రదర్శించారు. ఇది భక్తులను అలరించింది.
నిడమర్రు: పెదనిండ్రకొలనులో శనివారం సాయంత్రం జరిగిన స్వయంభూ భీమేశ్వరస్వామి రథోత్సవంలో విషాదం నెలకొంది. రథ నియంత్రకుడిగా ఉన్న గంథం రామకృష్ణ (40) గుండెపోటుతో మృతి చెందాడు. రథం ముందుకు లాగుతున్నప్పుడు దాని వేగాన్ని నియంత్రించేందుకు చెక్కను బ్రేకులుగా ఉంచుతారు. శనివారం కూడా ఇదే విధంగా పనిలో ఉండగా.. ఒక్కసారిగా వాంతులతో కుప్పకూలిపోయాడు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లి చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది.
తాళం వేసిన ఇంట్లో చోరీ
తాళం వేసిన ఇంట్లో చోరీ


