భక్త జనారణ్యంగా కొల్లేటికోట
జాతరకు తరలివచ్చిన భక్తులు
కైకలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవాలయం భక్తజన సంద్రంగా మారింది. జాతరలో ప్రధాన ఘట్టమైన శ్రీ జలదుర్గాగోకర్ణేశ్వరస్వామి కల్యాణాన్ని తిలకించడానికి దేశవిదేశాల నుంచి భక్తులు శనివారం తరలివచ్చారు. ఉదయం నుంచి భక్తుల రాక మొదలైంది. మహిళలు వేప మండలు పట్టుకుని తన్మయత్వంతో చిందులు తొక్కారు. దేవస్థాన సమీప కొల్లేరు గ్రామాల్లో పండగ వాతావరణం కనిపించింది. మహిళల బోనాల సమర్పణ, ప్రభల ఉరేగింపు, వివిధ సాంస్కృతిక కళారూపాల ప్రదర్శన ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, వడ్డీ కార్పొరేషన్ చైర్‌పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ చైర్మన్ జల్లూరి చిన వెంకన్న, ఈవో కూచిపూడి శ్రీనివాసు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ ఏడాది మొదటి సారిగా కల్యాణం అనంతరం పందిరిపల్లిగూడెంలో భారీ అన్నసమారాధన నిర్వహించనున్నారు.
భక్తితో అమ్మకు బోనాలు
తెలంగాణలో మాదిరిగా పెద్దింట్లమ్మకు బోనాల సమర్పణ 2020 నుంచి కొనసాగిస్తున్నారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల పలు నియోజకవర్గాల నుంచి మహిళలు 15,000 మంది పాల్గొన్నారని అంచనా. సమీప గ్రామాల నుంచి నడుచుకుంటూ మహిళలు బోనాలు సమర్పించారు. పందిరిపల్లిగూడెం నుంచి ప్రభల ఉరేగింపు ఆకట్టుకుంది. యువత నృత్యాలు, శక్తి వేషాల ప్రదర్శన అలరించాయి. భక్తులకు గ్రామస్తులు ఉచిత మజ్జిగ పంపిణి చేశారు. వైస్ ఎంపీపీ మంగినేని రామకృష్ణ, కొల్లేరు నాయకులు బలే ఏసురాజు, పూలా రాజీ, కొల్లి బాబీ, వీరమల్లు నరసింహారావు, చలపతి, సైదు సత్యనారాయణ, వివిధ కొల్లేరు గ్రామాల సర్పంచులు, పాలకవర్గ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఏలూరు లావణ్య ఈవెంట్స్ భక్తి సంగీత విభావరి ఆకట్టుకుంది. శనివారం అర్థరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు జలదుర్గాగోకర్ణేశ్వరస్వామి కల్యాణం జరగనుంది.
భారీ పోలీసు బందోబస్తు
ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలలో డీఎస్పీ డి.శ్రవణ్‌కుమార్, రూరల్ సర్కిల్, టౌన్ సీఐలు వి.రవికుమార్, ఏవీఎస్.రామకృష్ణ జాతరలో కల్యాణ ఘట్టానికి భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పగలు, రాత్రి వేళల్లో వినియోగించే అత్యాధునిక డ్రోన్లను ఉపయోగించారు. ట్రాఫిక్ సమస్య రాకుండా పార్కింగ్ స్థలాలను ముందే కేటాయించారు.
పెద్దింట్లమ్మ జాతరలో కల్యాణానికి పోటెత్తిన భక్తులు
ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి బోనాలు సమర్పణ
నేడు పందిరిపల్లిగూడెంలో భారీ అన్నసమారాధన
భక్త జనారణ్యంగా కొల్లేటికోట
భక్త జనారణ్యంగా కొల్లేటికోట
భక్త జనారణ్యంగా కొల్లేటికోట
భక్త జనారణ్యంగా కొల్లేటికోట


