శ్రీవారి కొండపై అన్యమత ప్రచార ఆరోపణలు
ద్వారకాతిరుమల: శ్రీవారి కొండపై శనివారం ఓ మహిళ బైబిల్ చదవడం వివాదాస్పదమైంది. ఈ ఘటనలో సదరు మహిళతో పాటు, ఆటో డ్రైవర్, మరో వ్యక్తిని దేవస్థానం సెక్యురిటీ సిబ్బంది స్థానిక పోలీసు స్టేషన్‌లో అప్పగించారు. తూర్పుగోదావరి జిల్లా కడియపులంకకు చెందిన 8 మంది విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించి, అక్కడి నుంచి నేరుగా టాటా మ్యాజిక్ ఆటోలో సాయంత్రం ద్వారకాతిరుమల కొండపైకి చేరుకున్నారు. అందులో ఆరుగురు శ్రీవారి దర్శనం నిమిత్తం ఆలయంలోకి వెళ్లారు. అనంతరం డ్రైవర్ ఆటోను ప్రసాదాల కౌంటర్ల వద్ద పార్క్ చేశాడు. ఆటోలో ఓ మహిళ, మరో వ్యక్తి, ఆటో డ్రైవర్ ఉన్నారు. సదరు మహిళ ఆటోలో బైబిల్ చదవడాన్ని అక్కడున్న భక్తులు గమనించి, ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న దేవస్థానం సెక్యురిటీ సిబ్బంది ఆ మహిళను, మరో వ్యక్తిని, ఆటో డ్రైవర్‌ను పోలీసుస్టేషన్‌లో అప్పగించారు. ఆటోను సైతం పోలీస్టేషన్‌కు తరలించారు. పోలీసులు విచారణ చేస్తున్నారు.


