14 కి.మీ. ప్రయాణం.. ప్రాణసంకటం
వెంటనే పనులు ప్రారంభించాలి
నాణ్యతగా నిర్మించాలి
భక్తులు ఇబ్బంది పడుతున్నారు
ద్వారకాతిరుమల: ఆ రహదారిపై ప్రయాణమంటే.. ఎవరైనా భయపడాల్సిందే. ఎందుకంటే పైకి లేచిన కంకర రాళ్ల మీద ప్రయాణం వాహనదారులకు ప్రాణసంకటంగా మారింది. ద్వారకాతిరుమల క్షేత్రానికి పాదయాత్రగా వెళ్లే భక్తులకు నరకప్రాయమైంది. 108 ఇతర ఆంబులెన్స్‌లు సైతం ఆ రోడ్డుపై వెళ్లడం లేదంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతోంది. వివరాల్లోకి వెళితే. ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లి నుంచి కొత్తగూడెం, రామసింగవరం మీదుగా తూర్పుగోదావరి జిల్లా, నల్లజర్ల మండలం, పోతవరం గ్రామానికి వెళ్లే సుమారు 14 కిలో మీటర్ల మేర ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. ఈ రహదారిని చూస్తే అసలు రోడ్డు ఉందా.. అనే అనుమానం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రహదారులను నిర్మిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కూటమి అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఈ రోడ్డును నిర్మించకపోవడం పట్ల ప్రయాణికులు, రైతులు, భక్తులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
నరకయాతన..
కొత్తగూడెం, రామసింగవరం ప్రజలు నిత్యం తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రోడ్డుపై ప్రయాణిస్తూ నరకయాతన అనుభవిస్తున్నారు. రాళ్లు పరచినట్టుగా ఉన్న ఈ రోడ్డుపై వాహనాలు వెళ్లడం కష్టతరంగా మారింది. తరచూ ఎంతో మంది ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల భారిన పడుతున్నారు. కార్లు ఇతర వాహనదారులు సైతం తమ వాహనాలు పాడైపోతున్నాయని గగ్గోలు పెడుతున్నారు. ఈ రెండు గ్రామాల ప్రజలకు వైద్య సేవలు సైతం దూరమయ్యాయంటే అందుకు ఈ రహదారే కారణం. అత్యవసర పరిస్థితుల్లో 108 ఇతర ఆంబులెన్స్‌లు కూడా ఆ గ్రామాలకు వెళ్లడం లేదు. ఎవరైనా ఫోన్ చేస్తే ఆ రోడ్డు మీదుగా రావాలంటే రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని ఆంబులెన్స్ సిబ్బంది చెబుతున్నారట. దాంతో చేసేదేమీ లేక రోగులను ద్విచక్ర వాహనాలపై ఆస్పత్రులకు తీసుకెళ్లాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు.
పోతిరెడ్డిపాలెం వద్ద రోడ్డు మార్జిన్లలోని చెత్తా, చెదారం తొలగింపు పనులు గురువారం ప్రారంభమయ్యాయి. అయితే తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని చాదరాసికుంట వరకే ఈ రోడ్డు పనులు జరుగుతాయని అందరూ అంటుంటే.. కొత్తగూడెం, రామసింగవరం ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎప్పటి నుంచో తమ రహదారిని నిర్మించాలని పాలకులను వేడుకుంటున్నామని పలువురు వాపోతున్నారు. వెంటనే రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ రహదారి నిర్మాణానికి సంబంధించి రూ.4 కోట్లు నిధులు మంజూరయ్యాయని, త్వరితగతిన రోడ్డు నిర్మాణ పనులు చేపడతామని ఎంపీడీవో పల్లగాని ప్రకాష్ తెలిపారు.
అధ్వానంగా జి.కొత్తపల్లి–పోతవరం రోడ్డు
రహదారిపై రాళ్లు పైకిలేచి నిత్యం ప్రమాదాలు
పలు గ్రామాల ప్రజలకు తప్పని ఇక్కట్లు
దశాబ్ధకాలం క్రితం నిర్మించిన ఈ రోడ్డు అప్పట్లో 6 నెలలకే పూర్తిగా ధ్వంసం అయ్యింది. ఈసారైనా నాణ్యతగా నిర్మించాలి. రాళ్లు పైకిలేచిన ఈ రోడ్డుపై నిత్యం ప్రయాణం నరకంగా మారింది. బైక్‌లు, ఆటోలు, స్కూల్ బస్సులు, పొలాలకు వెళ్లే రైతులు ఈ రోడ్డుపై రాకపోకలు సాగించలేకపోతున్నారు. గ్రామంలోకి ఆంబులెన్స్‌లు కూడా వచ్చే పరిస్థితి లేదు.
– గంగుల రాంప్రసాద్, రామసింగవరం, గ్రామస్తుడు
ద్వారకాతిరుమల క్షేత్రానికి పాదయాత్రగా వెళ్లే భక్తులు ఈ రాళ్ల రోడ్డుపై అడుగుతీసి అడుగు ముందుకు వేయలేకపోతున్నారు. అలాగే నిత్యం ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల భారిన పడుతున్నారు. ఇప్పటికై నా ఈ రోడ్డును పూర్తి స్థాయిలో నిర్మించాలి.
– మిడతా సత్యన్నారాయణ, కొత్తగూడెం, గ్రామస్తుడు
14 కి.మీ. ప్రయాణం.. ప్రాణసంకటం
14 కి.మీ. ప్రయాణం.. ప్రాణసంకటం
14 కి.మీ. ప్రయాణం.. ప్రాణసంకటం
14 కి.మీ. ప్రయాణం.. ప్రాణసంకటం


