సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తనిఖీ
తణుకు అర్బన్: సజ్జాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని జిల్లా ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్ కె.శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. బుధవారం కార్యాలయానికి వచ్చిన ఆయన దస్త్రాలు పరిశీలించి రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన ప్రజలతో మాట్లాడారు. రిజిస్ట్రేషన్ సమయంలో ఏవైనా సమస్యలున్నాయా, రిజిస్ట్రేషన్ పూర్తయిన తరువాత సకాలంలో దస్తావేజులు అందిస్తున్నారా అని ఆరా తీశారు. కార్యాలయంలో తాగునీరు, మరుగుదొడ్లు తదితర వసతులు పరిశీలించారు. ఆయన వెంట సజ్జాపురం సబ్ రిజిస్ట్రార్ ఏవీ కృష్ణంరాజు, సిబ్బంది పాల్గొన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం గునుపూడి గ్రామంలో వేంచేసిన శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయంలో మహాశివరాత్రి కల్యాణ మహోత్సవాల ఏర్పాట్లను దేవదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ వేండ్ర త్రినాథరావు బుధవారం పరిశీలించారు. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో డీఈఓ హరి సూర్యప్రకాష్, వర్ధినీడి వెంకటేశ్వరరావు, ఆలయ ధర్మకర్తల మండల చైర్మన్ చింతలపాటి బంగార్రాజు తదితరులు పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం (టీఓసీ): డోర్ డెలివరీ బుకింగ్స్‌లో తాడేపల్లిగూడెం డిపో ప్రథమ స్థానం సాధించింది. విజయవాడ జోన్–2 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి.విజయరత్నం, జోనల్ ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు చేతుల మీదుగా బుధవారం తాడేపల్లిగూడెం డిపో కార్గో రీజినల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ జి.మాధవరావు ఏలూరులో అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా పలువురు అభినందించారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ సర్వసభ్య సమావేశం బుధవారం స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించారు. సమావేశంలో 2026– 2027 సంవత్సరానికి జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధి తదితర పనులకు రూ.25 కోట్లతో ప్రతిపాదనలను రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖ సంచాలకుడికి పంపడానికి తీర్మానించి ఆమోదం తెలిపారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చెర్మన్ జుత్తుగ నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం.శేఖర్ బాబు, వయోజన విద్యాశాఖ ఉప సంచాలకుడు జీసీహెచ్ ప్రభాకర్, వయోజన విద్యాశాఖ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఆర్.విజయ్ కుమార్ పాల్గొన్నారు.
పోలవరం రూరల్: మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పట్టిసం శివక్షేత్రంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. పోలవరం మండలం పట్టిసం శివక్షేత్రంలో ఈ నెల 14 నుంచి 16 వరకు ఇసుక తిన్నెలపై జరిగే ఉత్సవాలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది. లక్షన్నరకు పైగా భక్తులు హాజరవుతారనే అంచనాతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి నదిలో భక్తులు నడిచి వెళ్లేందుకు వీలుగా పంట్లు ఏర్పాటు చేసి క్షేత్రం వైపు ఇసుకతో ర్యాంపు ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ఇసుక తిన్నెలపై చలువ పందిళ్ళ నిర్మాణం చేపట్టారు. వాహనాలు పార్కింగ్ ప్లేస్‌లు, తాత్కాలిక బస్టాండ్‌ల ఏర్పాట్లకు సంబంధించిన ప్రదేశాలను సంబంధిత శాఖ అధికారులు గుర్తించారు. ఈ ఏడాది వరద ప్రవాహం మారడంతో నది మధ్యలో రెండు పాయలుగా ఏర్పడింది. దీంతో నడిచి వెళ్లి వచ్చేందుకు మార్గం దూరమైంది. ఇసుక తిన్నెలపై తాత్కాలిక మరుగుదొడ్లు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు వీలుగా కర్రలు, తాటాకులతో నిర్మాణాలు చేపట్టారు. వీరేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వీలుగా క్యూలైన్‌లు, బారికేడ్ల పనులు చేస్తున్నారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తనిఖీ


