
రోడ్లు ఛిద్రం.. ప్రయాణం నరకం
కనీసం గోతులైనా పూడ్చండి
● నాసిరకంగా మరమ్మతులు
● అడుగడుగునా గోతులు
● కూటమి పాలనలో రహదారుల దుస్థితి
పెనుగొండ : జిల్లాలో ప్రధాన రహదారులు కనీస మరమ్మతులకు నోచుకోక గోతులమయంగా మారాయి. గోతులు లేని రహదారులే లక్ష్యమంటూ కూటమి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినా ఆచరణలో మాత్రం శూన్యంగా ఉంది. గతేడాది నామమాత్రంగా మరమ్మతులు చేయడంతో తిరిగి రోడ్లన్నీ ఛిద్రంగా మారాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో గోతులన్నీ వర్షం నీటితో నిండిపో యాయి. జిల్లాలో 700 కిలోమీటర్లకు పైగా రోడ్ల మరమ్మతులను రూ.43 కోట్లతో చేపట్టినా ఫలితం లేదు. ప్రధానమైన 180 పనులకు గాను ఈ మొత్తాన్ని వెచ్చించారు. అయితే పనుల్లో నాణ్యతాలేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. చాలా ప్రాంతాల్లో నాసిరకం పనులు చేయడంతో రహదారులన్నీ తిరిగి గోతులమయంగా మారాయి. కొన్ని చోట్ల గుంతల్లో కంకర, చిప్స్ వేసి పైనా వెట్ మిక్స్ వేసి వదలి వేశారు. అయితే ఇవి కనీసం రెండు నెలలు కూడా నిలవలేదు. వర్షాలు, వాహనాల తాకిడికి రోడ్లు గోతులతో నిండిపోతున్నాయి.
ప్రయాణం.. ప్రమాదభరితం
జిల్లా ముఖద్వారం దొంగరావిపాలెం నుంచి మొ దలై జిల్లా కేంద్రం భీమవరం ప్రయాణం చేసే వరకూ ప్రయాణికులకు నరకం కనిపిస్తోంది. దొంగరావిపాలెం టోకు మార్కెట్ వద్ద ఇటీవల పూడ్చిన గోతులు మరలా దర్శనం ఇస్తున్నాయి. సిమెంట్ రోడ్డు ఎగువ, దిగువ ఇదే పరిస్థితి. రామన్నపాలెం, వడలి, మల్లప్పదిబ్బల్లోనూ రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఇక బ్రాహ్మణ చెరువు, పొలమూరు, నౌడూరుల మధ్య గోతులను వర్ణించలేం. మధ్యమధ్యలో గోతులు పూడ్చేస్తున్నామంటూ నాసిరకం మెటీరియల్ దింపి మమ అనిపించేస్తున్నారు. ఇదే పరిస్థితి అండలూరు రహదారిలోనూ నెలకొంది. పెనుగొండ–పెరవలి, పెనుగొండ–కంతేరు రహదారుల్లోనూ గోతులతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. రోడ్లన్నీ వర్షాకాలంలో చెరువులను తలపిస్తూ.. ఎండ కాసినప్పుడు దుమ్ము లేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఆర్భాటపు ప్రకటనలు మాని కనీసం ప్రధాన రహదారుల్లో అయినా గోతులు పూడ్పించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రధాన రహదారులు గోతులమయంగా మారాయి. ఇటీవల కురిసిన వర్షాలతో గోతులు మరింత పెద్దవి అయ్యాయి. గోతులను నాసిరకం మెటీరియల్‌తో పూడ్చుతున్నారు. ఇవి కనీసం నెల రోజులు కూడా ఆగడం లేదు. దొంగరావిపాలెం వద్ద పడిన గోతులతో మోటార్ సైక్లిస్టులు ప్రమాదాలకు గురవుతున్నారు. గతంలో ఓ వ్యక్తి మరణించాడు. ఇప్పుడు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కనీసం రహదారుల్లో గోతులనైనా పూడ్చించండి.
–గుబ్బల వీరబ్రహ్మం, తూర్పుపాలెం

రోడ్లు ఛిద్రం.. ప్రయాణం నరకం

రోడ్లు ఛిద్రం.. ప్రయాణం నరకం

రోడ్లు ఛిద్రం.. ప్రయాణం నరకం