
ఎరువుల షాపుల్లో తనిఖీలు
కామవరపుకోట: వ్యవసాయ శాఖ జిల్లా అధికారి షేక్ హబీబ్ బాషా కాపువరపుకోట మండలంలో ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు దుకాణాల్లో ఎరువుల నిల్వల్లో తేడాలున్నట్లు గుర్తించారు. కామవరపుకోటలోని కొండూరు రామ్మోహనరావు ఎరువుల దుకాణం వద్ద రూ.2,56,471 విలువచేసే 5 టన్నుల ఎరువులు, కొండూరు నాగేశ్వరరావు ఎరువుల షాపు వద్ద రూ.3,73,168 విలువచేసే 26.850 టన్నులు, శ్రీ సూర్య ఆగ్రోస్ షాప్‌లో రూ.20 వేలు విలువ చేసే 2 టన్నుల ఎరువుల నిల్వల్లో వ్యత్యాసాలు ఉండడంతో వాటి విక్రయాలను నిలుపుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ప్రైవేటు డీలర్ల వద్ద యూరియా 98 మెట్రిక్ టన్నులు, సొసైటీల వద్ద 37.5 టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని, కావలసిన రైతులు అవసరం మేరకు వ్యవసాయంలో వినియోగించుకోవాలన్నారు. డీలర్లు ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో చింతలపూడి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు వై. సుబ్బారావు, మండల వ్యవసాయ అధికారి డి.ముత్యాలరావు పాల్గొన్నారు.