
సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి
బోర్డును వెంటనే ప్రారంభించాలి
ఆందోళనలు ఉధృతం చేస్తాం
తాడేపల్లిగూడెం (టీఓసీ): భవన నిర్మాణ కార్మికులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేశారు. వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరిస్తామని, కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రయోజనాలు తప్పక అందజేస్తామని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. అప్పటి నుంచి నేటి వరకు ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం పైనే అవుతున్నా, ఎన్నికల హామీలు నేటి వరకు అమలు చేయలేదని, ఇబ్బందులలో ఉన్నామని నిర్మాణ రంగ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 60 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులుండగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 5 లక్షల మంది కార్మికులు ఉన్నారు. వెల్ఫేర్ బోర్డులో సభ్యులుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారుగా 1.20 లక్షల మంది నమోదు చేసుకున్నారు. ఒక వైపు పనులు లేకపోవడం, మరో వైపు నిత్యావసర ధరలు, అన్ని రకాల ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపధ్యంలో ఇప్పటికే కార్మికులు ఆవేదనలో ఉన్నారు. దీంతో చేసేది లేక భవన నిర్మాణ కార్మిక సంఘాలు హక్కుల సాధన కోసం పోరుబాట పట్టాయి. ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని, బోర్డును క్రియాశీలం చేసి పటిష్ట పరచాలని, అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని, భవన నిర్మాణ కార్మికుల సొమ్మును భవన కార్మికులకు ఖర్చు పెట్టాలని, బోర్డులో నెంబర్లును నియమించాలని కార్మికులు కోరుతున్నారు.
ఆందోళనలు ఉధృతం
ఇప్పటికే వార్డు సచివాలయాలు, తహసీల్దార్ కార్యాలయాలు, అసిస్టెంట్ లేబర్ కార్యాలయాలు వద్ద, జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ధర్నాలు నిర్వహించి అధికారులకు సమస్యలు పరిష్కరించాలని వినతులు ఇచ్చారు. రాష్ట్రంలోని అందరు ఎమ్మెల్యేలకు, వెల్ఫేర్ బోర్డు చైర్మన్‌కు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విన్నవించారు. పోస్టుకార్డుల ఉద్యమం చేపట్టారు. త్వరలో సమస్యల పరిష్కారం చూపుతామని అంటున్నారు తప్ప సమస్యలు తీర్చే పరిస్థితి కానరావడం లేదని నిర్మాణ రంగ కార్మికులు వాపోతున్నారు.
కార్మికుల డిమాండ్లు
● భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును క్రియాశీలం చేసి పటిష్ట పరచాలి.
● బోర్డులో కార్మికుల నమోదు ప్రక్రియను సులభతరం చేసేందుకు వార్డు, గ్రామ సచివాలయంలో నమోదు చేయడానికి అవకాశం కల్పించాలి.
● పెండింగ్‌లో ఉన్న క్‌లైయిమ్స్ పరిష్కరించాలి, వెల్ఫేరు బోర్డులో నమోదైన కార్మికులకు వెంటనే గుర్తింపు కార్డులు మంజూరు చేయాలి
● వయోభారం లేదా అనారోగ్యం కారణంగా పని నుంచి విరమించుకున్న కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ద్వారా పెన్షన్ మంజూరు చేయాలి
● ప్రమాదాలు వల్ల అనారోగ్యం వల్ల మంచాన పడిన కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ద్వారా ఈఎస్‌ఐ తరహాలో ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలి.
● భవన నిర్మాణ కార్మికులకు ఐదు రోజులు ఆసుపత్రిలో ఉండాలనే నిబంధన తొలగించాలి.
ఆందోళన బాటలో భవన నిర్మాణ కార్మికులు
భవన నిర్మాణ కార్మికులకు అందించే ఏకై క విభాగం వెల్ఫేర్ బోర్డు. బోర్డు ప్రస్తుతం అందుబాటులో లేదు. ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరించి, పెండింగ్ క్‌లైయింలు పరిష్కారం చేస్తామని చెప్పారు. బోర్డును తక్షణమే పునఃప్రారంభించాలి. వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరించకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం.
– మైలవరపు శ్రీరాంబాబు,
ఆర్గనైజింగ్ సెక్రటరీ, జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం
భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం అందించాల్సిన సంక్షేమ పథకాలు నిలిచిపోవడంతో కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. బోర్డు నిధులను కార్మికుల సంక్షేమానికి, భద్రతకు, బీమాకు ఖర్చుచేయాలి. చేతినిండా పనులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నాం. సంక్షేమాలు అమలు చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తాం.
– సింగవరపు సునీల్, ప్రధాన కార్యదర్శి
నవాబుపాలెం భవన నిర్మాణ కార్మిక సంఘం

సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి

సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి