ముంచుతున్న ముసురు | - | Sakshi
Sakshi News home page

ముంచుతున్న ముసురు

Aug 18 2025 6:27 AM | Updated on Aug 18 2025 6:27 AM

ముంచు

ముంచుతున్న ముసురు

కౌలు రైతుకు కన్నీరే

డ్రెయిన్ల ఆక్రమణలతోనే ముంపు

తీవ్రంగా నష్టపోయాం

పెనుగొండ : వరుస ముసుర్లు సార్వా సాగును నిండా ముంచుతున్నాయి. గత వారం కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో 21 వేల ఎకరాలు ఇంకా వర్షపు నీటి ముంపులోనే ఉన్నాయి. మరోవైపు ఆదివారం తెల్లవారుజాము నుంచి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.

భారీ వర్షాలకు పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఇప్పటికే ఎకరాకు రూ.15 వేల వరకూ పెట్టుబడి పెట్టారు. జిల్లాలో 2.08 లక్షల ఎకరాల్లో సార్వా సాగుకు సన్నద్ధం కాగా, ఇప్పటికి 1.84 ఎకరాల్లో నాట్లు పూర్తి చేశారు. ఆచంట దిగువ, యలమంచిలి, నర్సాపురం మండలాల్లో నాట్లు పూర్తి చేయాల్సి ఉంది. ఈ తరుణంలో ముసుర్లు ప్రారంభం కావడంతో నాట్లు వేయడం మరింత ఆలస్యమవుతోంది. ఇదిలా ఉండగా, వరినాట్లు పూర్తి చేసిన 16 మండలాలకుగాను 164 గ్రామాల్లో సుమారు 21 వేల ఎకరాలు నీటి మునిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.

అత్తిలి, పెనుమంట్ర, ఆచంట, పెనుగొండ, పోడూరు, తణుకు, తాడేపల్లిగూడెంలో ముంపు తీవ్ర త అధికంగా ఉంది. మురుగు డ్రెయిన్ల ఆక్రమణలతో మురుగు కిందకు ప్రవహించే అవకాశం లేకుండా పోవడంతో రెండు మూడు రోజులుగా ముంపులోనే వరిచేలు ఉన్నాయి. దీంతో నాట్లు కుళ్లుపోయే అవకాశం ఉందని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.

ఏటా ముంపే..

ఈ ఏడాది రైతన్నల దుస్థితి అయోమయంగా మారింది. నిన్న మొన్నటి వరకూ అధిక ఎండ తీవ్రతతో సాగునీటి కొరతను ఎదుర్కొన్నారు. ఒక్కసారిగా వారంలోనే పరిస్థితి తారుమారైంది. సార్వా సాగు ఆదిలోనే ముసుర్లు ముంచుకొచ్చాయి. ఒక్కసారిగా భారీగా కురుస్తున్న వర్షాలతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఏపుగా ఎదిగిన వరిచేలు ముంపునకు గురి కావడంతో ఆవేదనకు గురవుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నాట్లు ముందుగా వేసిన రైతులు మొదటి దఫా ఎరువులు సైతం పూర్తి చేశారు. ముఖ్యంగా జిల్లాలో నక్కల డ్రయిన్‌, తాడేరు డ్రయిన్‌, గోస్తనీ నదుల ప్రాంతంలో ఉన్న వరిచేలు ఏటా ముంపునకు గురవుతూ తీవ్ర నష్టాన్ని మిగులుస్తున్నాయి. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం వలనే మురుగు డ్రెయిన్ల వెంట ఉన్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ముంపునకు గురైన వరిచేలను గుర్తించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ముసురుతో వరిచేలు మునగడంతో కౌలు రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. ఇప్పటికే వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టాం. రెండు, మూడు రోజులుగా ముంపులోనే వరి చేలు ఉన్నాయి. ప్రభుత్వం కౌలు రైతును గుర్తించి నష్టపరిహారం అందించాలి.

– రాపాక మోజేస్‌, కౌలు రైతు, పెనుగొండ

నక్కల డ్రెయిన్‌లో ఆక్రమణలతో వరిచేలు మునుగుతున్నాయి. నక్కల డ్రెయిన్‌ ప్రక్షాళన ఇప్పటి వరకూ చేపట్టలేదు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకొన్నా పట్టించుకొన్న నాథుడే కరువయ్యాడు. 15 ఏకరాలు కౌలుకు చేస్తున్నా. పూర్తిగా నక్కల డ్రెయిన్‌ ముంపులోనే ఉన్నాయి.

– నరసన్న, కౌలు రైతు,పెనుగొండ

వరుస ముసుర్లుతో వరిచేలన్నీ ముంపునకు గురయ్యాయి. గోస్తనీ నదీ పరివాహక ప్రాంతమంతా నీట మునిగింది. ఏటా ఇదే పరిస్థితి నెలకొంటుంది. నాట్లు వేసిన తరువాత ముంపుతో వరి నాట్లు కుళ్లిపోతున్నాయి. మరోసారి నాటుకోవాల్సి వస్తోంది.

– అంగర నాగరాజు, రైతు, పెనుమంట్ర

ఇప్పటికీ ముంపులోనే 21 వేల ఎకరాలు

తాజాగా మరోసారి ముసురుతో ఆందోళన

డ్రెయిన్ల ఆక్రమణలతో ఏటా నష్టపోతున్న రైతులు

ముంచుతున్న ముసురు1
1/5

ముంచుతున్న ముసురు

ముంచుతున్న ముసురు2
2/5

ముంచుతున్న ముసురు

ముంచుతున్న ముసురు3
3/5

ముంచుతున్న ముసురు

ముంచుతున్న ముసురు4
4/5

ముంచుతున్న ముసురు

ముంచుతున్న ముసురు5
5/5

ముంచుతున్న ముసురు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement