
నీరు లాగక.. వేదన తీరక
గణపవరం: సార్వా పైరు ఇంకా ముంపులోనే ఉంది. బుధవారం రాత్రి కనీవినీ ఎరుగని రీతిలో కురిసిన భారీ వర్షానికి మండలంలోని పలు గ్రామాల్లో సార్వా పైరు నీట మునిగింది. సుమారు 650 హెక్టార్ల విస్తీర్ణంలో పైరు నీట మునిగినట్లు ప్రాథమికంగా అంచనావేశారు. ఈ నష్టం దాదాపు రెట్టింపు ఉంటుందని రైతులు చెబుతున్నారు. కొందేపాడు, పిప్పర, కేశవరం, కోమర్రు, వెంకట్రాజపురం, సరిపల్లె, కొత్తపల్లి, గణపవరం తదితర గ్రామాలలో వరినాట్లు నీటమునిగాయి. చినరామచంద్రపురంలోని పల్లపుభూములలో నాట్లు మొత్తం నీటమునిగాయి. పిప్పర పరిసర గ్రామాలలో వరిపైరు చివరలు కనిపిస్తున్నాయి. పొలాలలో నీరు బయటకు పంపడానికి రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. చుక్కనీరు బయటకుపోయే మార్గం కనిపించడంలేదు. ఇంజిన్లు వేసి నీటిని బయటకు తోడుకుంటున్నారు. కాలువగట్లు పల్లంగా, బలహీనంగా ఉన్న చోట్ల గట్లను రైతులే మట్టి, కంకరతో పటిష్టం చేసుకుంటున్నారు. శుక్ర, శనివారాలలో వర్షం కురియక పోవడంతో పరిస్థితి కొంత కలిసివచ్చింది.