
ఉధృతంగా వరద గోదావరి
న్యూస్‌రీల్
ఈ సీజన్‌లో మూడోసారి
ఆదివారం శ్రీ 17 శ్రీ ఆగస్టు శ్రీ 2025
సాక్షి ప్రతినిధి, ఏలూరు: గోదావరిలో మళ్లీ వరద మొదలైంది. ఈ సీజన్‌లో ముచ్చటగా మూడోసారి వరద తీవ్రత ప్రారంభమై నదిలో ఉధృతంగా ప్ర వహిస్తోంది. ఎగువ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలతో గోదావరి, శబరి నదులు రెండు రోజుల నుంచి ఉధృతంగా మారాయి. శనివారం పోలవరం ప్రాజెక్టు నుంచి 4.31 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. మరో మూడు రోజులపాటు వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉంది.
భద్రాచలం వద్ద 29.80 అడుగులు
భద్రాచలం వద్ద శనివారం 29.80 అడుగుల మేర నీరు ప్రవహిస్తుండటంతో పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే 29.680 మీటర్ల ఎత్తు నుంచి దిగువకు 4,31,813 క్యూసెక్కుల నీటిని సాయంత్రం 6 గంటల సమయానికి విడుదల చేశారు. ఆదివారం రాత్రికి 6 లక్షల క్యూసెక్కులు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే మరో నాలుగు రోజుల పాటు మహారాష్ట్ర, తెలంగాణలో అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు అధికంగా కురుస్తాయని అంచనా వేశారు. దానికి అనుగుణంగా సోమవారం భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం ఉంది. తర్వాత రెండు రోజుల పాటు 6 నుంచి 7 లక్షల క్యూసెక్కుల నీరు పోలవరం ప్రాజెక్టుకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయితే వేలేరుపాడులో 18 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంది. మళ్లీ వరద హెచ్చరికలతో ముంపు గ్రామాల్లో భయం నెలకొంది.
30 టీఎంసీలు నిల్వ చేస్తూ..
ఏటా జూలై, ఆగస్టు నెలల్లో రెండు సార్లు వరదలు వస్తుంటాయి. అయితే ఈ ఏడాది ఇప్పటికే జూలైలో రెండుసార్లు వరద రాగా తాజాగా మూడోసారి మొదలైంది. గత నెలలో గోదావరి, శబరి మాత్రమే ఉధృతంగా ప్రవహించి 13, 14వ తేదీల్లో 7 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల కావడంతో ఏజెన్సీతో పాటు యలమంచిలిలోని లంక గ్రామాలకు నీరు చేరిన పరిస్థితి. ఈసారి గోదావరి, శబరితో పాటు తమ్మిలేరు, మున్నేరు కూడా భారీ వరద నీటితో ఉధృతంగా మారుతున్నాయి. దీంతో తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులో 30 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ ఉంచి, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటిని యథాతథంగా విడుదల చేస్తున్నారు.
ఈ ఏడాది వర్షాకాలం సీజన్‌లో గోదావరికి ముచ్చటగా మూడోసారి వరద ప్రారంభమైంది. గత నెలలో రెండుసార్లు వరదలు వచ్చాయి. మళ్లీ శుక్రవారం నుంచి వరద తీవ్రత ప్రారంభమైంది. ఏటా వర్షాకాలం సీజన్‌లో వరదల నేపథ్యంలో సగటున 1,900 టీఎంసీల నీరు సముద్రం పాలవుతున్నట్టు అధికారిక అంచనా. గత నెలలో రెండుసార్లు వచ్చిన వరదలతో ముంపు మండలాలైన వేలేరుపాడు, కుక్కునూరులో రాకపోకల్లో కీలకంగా ఉండే ఎద్దులవాగు, గుండేటి వాగు వంతెనలు కొన్ని రోజల పాటు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలేరుపాడులో 18 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. అలాగే 270 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు కూడా తరలించిన పరిస్థితి. దీంతో పాటు జూలై నెలలో వచ్చిన రెండు వరదలకు రోజుకు సగటున 4 లక్షలకు పై గా క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలై మొత్తంగా 420.26 టీఎంసీల నీరు కడలిపాలయ్యింది.
నదిలో పెరుగుతున్న ఉధృతి
4.31 లక్షల క్యూసెక్కులు దిగువకు..
గత నెలలో 420 టీఎంసీలు కడలిపాలు
ముంపు గ్రామాల్లో భయం.. భయం
18 నాటికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం

ఉధృతంగా వరద గోదావరి