
నక్కల కాలువతో పొలాలకు ముంపు
పెనుగొండ: జిల్లాలో 30 వేల ఎకరాల ఆయకట్టు పరిధిలో ముంపునకు కారణమవుతున్న నక్కల కాలువ మురుగు డ్రెయిన్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లాప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు డిమాండ్ చేశారు. ఆచంట, పెనుగొండ మండలాల్లో భారీ వర్షాలతో ముంపు బారిన పడిన చేలను శనివారం ఆయన పరిశీలించారు. అధిక వర్షాలు, నక్కల కాలువ వల్ల శేషమ్మ చెరువు, మార్టేరు, తూర్పుపాలెం, నెగ్గిపూడి, కొఠాలపర్రు, సోమరాజు చెరువు గ్రామాల్లో పొలాలు ముంపు బారిన పడ్డాయన్నారు. వీటిని ఎక్కువగా కౌలు రైతులే సాగుచేస్తున్నారని, ఇప్పటికే ఎకరాకు రూ.15 వేల వరకు పెట్టుబడి పెట్టారన్నారు. పద్నాల చెరువు, తూర్పుపాలెం వద్ద కాలువపై ఉన్న వంతెన చిన్నగా నిర్మించి రెండు తూములే ఏర్పాటు చేయడంతో ముంపు నీరు లాగడం లేదన్నారు. దీనికి శాశ్వత పరిష్కారంగా వడ్డిలంక డ్యామ్ వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ మోటర్లను ఆధునీకరించి, డ్యామ్ అవతలి వైపునకు పైపులు నిర్మించి ముంపునీరు బయటకు తోడేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పంట కోల్పోయిన రైతులకు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులు కేతా పద్మారావు, గుత్తుల ఏడుకొండలు, దొంగ సోమేశ్వరరావు, చింతపల్లి కొండయ్య పాల్గొన్నారు.