
కూటమి పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ
భీమవరం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి నిరంకుశ పాలన సాగిస్తోందని వైఎస్సార్‌సీపీ భీమవరం నియోజకవర్గ ఇన్‌చార్జి చినమిల్లి వెంకటరాయుడు విమర్శించారు. శుక్రవారం రాయలంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కూటమి అరాచక పాలనకు పులివెందుల, ఒంటిమిట్టలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికలే నిదర్శనమన్నారు. అడ్డగోలు హామీలతో అధికారం చేపట్టిన చంద్రబాబు గద్దెనెక్కిన తర్వాత హామీలు అమలుచేయాలని అడిగిన వారిపై దౌర్జన్యాలకు దిగుతున్నారన్నారు. ఓటర్లను పోలింగ్ బూత్‌లకు రానీయకుండా రిగ్గింగ్ చేసి గెలవడం హేయమన్నారు. సామాన్యులు ఓటు వేసే పరిస్థితి లేకుండా చేసిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కూటమి ప్రజావ్యతిరేక పాలనను ప్రజలంతా గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారని అన్నారు. పార్టీ నరసాపురం పార్లమెంట్ ఇన్‌చార్జి గూడూరి ఉమాబాల మట్లాడుతూ పులివెందుల, ఒంటిమిట్టలో జరిగిన ఉప ఎన్నికల్లో కూ టమి నాయకుల తీరును ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందని తెలిపారు. పార్టీ నాయకులు కామన నాగేశ్వరరావు, చిరుగుపాటి సందీప్, మానుకొండ ప్రదీప్, గాదిరాజు రామరాజు, కోడే యుగంధర్, గంటా సుందరకుమార్, పాలవెల్లి మంగ, పెచ్చెట్టి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.