
నిండా ముంచేను
గణపవరం: భారీ వర్షంతో గణపవరం, కొత్తపల్లి, చినరామచంద్రపురం, కేశవరం, పిప్పర, మొయ్యేరు, కొందేపాడు తదితర గ్రామాల్లో వరి చేలు ముంపుబారిన పడ్డాయి. బుధవారం రాత్రి భారీ వర్షం కురవగా గణపవరం, చినరామచంద్రపురం ప్రాంతాల్లో చేలల్లో మోకాలి లోతు నిలిచిపోయింది. మండల వ్యవసాయ అధికారి ఆర్‌ఎస్ ప్రసాద్, వ్యవసాయ సిబ్బంది నష్టం అంచనాలు తయారుచేస్తున్నారు. మండలంలో 650 హెక్టార్ల విస్తీర్ణంలో వరి నాట్లు నీటమునిగినట్టు అంచనా వేశారు. అలాగే మండలంలోని పంట, మురుగు కాల్వలు నిండుకుండల్లా ప్రవహిస్తున్నాయి. గట్లు బలహీనంగా ఉన్న చోట్ల రైతులు మట్టితో గట్లను పటిష్టం చేసుకుంటున్నారు. పలుచోట్ల కాలువలకు గండ్లు పడగా రైతులు చేలు మునగకుండా కాపాడుకుంటున్నారు. భారీ వర్షంతో గణపవరం నుంచి భీమవరం వెళ్లే రోడ్డు గోతులమయంగా మారి ప్రయాణం ప్రమాదకరంగా తయారైంది.