
వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలి
భీమవరం: కార్పొరేట్ల చెర నుంచి వ్యవసాయ రంగాన్ని దేశ సంపదను కాపాడుకోవాలని ఎస్‌కేఎం జిల్లా కన్వీనర్ ఆకుల హరే రామ్ పిలుపునిచ్చారు. క్విట్ కార్పొరేట్ కార్యక్రమంలో గొరగనమూడి రైస్ మిల్ నుంచి బైక్ ర్యాలీ ప్రకాశం చౌక్ చేరుకున్నాక అక్కడ సభ నిర్వహించారు. సభకు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. హరేరామ్ మాట్లాడుతూ దేశ ప్రజల సంపదను నల్ల కార్పొరేట్లకు దోచిపెట్టే మోదీ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడానికి మరో స్వాతంత్ర పోరాటం చేయాలన్నారు. సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు బి.వాసుదేవరావు మాట్లాడుతూ కేంద్రంలో మోదీ కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్‌ల అమలుకు ప్రయత్నించి కార్మిక హక్కులను కార్పొరేట్లకు తాకట్టు పెడుతున్నారన్నారు. టీయూసీసీ జిల్లా నాయకులు దండు శ్రీనివాసరాజు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం.రామాంజనేయులు, ప్రజా సంఘాల నాయకులు ఎం.ఆంజనేయులు, బాతిరెడ్డి జార్జి, ఎస్.ఆశ్రీయ్య, బొర్రా అలమహారాజు, చల్లబోయిన వెంకటేశ్వరరావు, బి. నాగు. డి.త్రిమూర్తులు పాల్గొన్నారు.
ఉచిత ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
భీమవరం: విద్యాహక్కు చట్టం–2009 పరిధిలో ప్రవేటు, అన్ ఎయిడెడ్ పాఠశాలలో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి.శ్యాంసుందర్ తెలిపారు. 25 శాతం శాతం కోటాలో అర్హత గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ వర్గాలు, అనాథలు, హెచ్‌ఐవీ బాధితులు, విభిన్న ప్రతిభావంతుల పిల్లలకు అర్హత ఉన్నవారికి ప్రవేశాలు ఉంటాయని తెలిపారు. వివరాలకు 86391 33614, 95533 80179 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.
కూటమి సంబరం వెలవెల
భీమవరం: భీమవరంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో కూటమి పార్టీల నాయకులు బుధవారం నిర్వహించిన రైతు సంబరం రైతులు లేక వెలవెలబోయింది. రైతులకు ఏటా రూ.20 వేలు అందిస్తామని హామీ ఇచ్చిన నాయకులు తొలి ఏడాది ఎగ్గొట్టారు. దీనికితోడు దాళ్వా ధాన్యం సొమ్ములను రైతులకు ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేయడం, ప్రస్తుత సార్వా సీజన్‌లో యూరియా కొరతతో ఇబ్బంది పడుతున్నారు. ఈ తరుణంలో కూటమి నాయకులు నిర్వహించిన కార్యక్రమానికి మొహం చాటేశారు.

వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలి