
నియోజకవర్గ విలీనంపై రచ్చ
ద్వారకాతిరుమల: ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా జిల్లాల సరిహద్దులు, పేర్లు, మండలాల మార్పులపై ఏడుగురు మంత్రులతో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. నెలరోజుల్లోగా దీనిపై నివేదిక ఇవ్వాలని ఈ కమిటీని ఆదేశించింది. అయితే ఈ మార్పుల్లో గోపాలపురం నియోజకవర్గం పేరు తెరమీదకొచ్చింది. గతంలో రాష్ట్రంలో 13 జిల్లాలు ఉండగా, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విభజన ద్వారా ఆ జిల్లాల సంఖ్యను 26కు పెంచింది. తాజాగా కూటమి ప్రభుత్వం ఆ జిల్లాల సంఖ్యను 32కు పెంచడంతో పాటు, ప్రస్తుతం ఉన్న జిల్లాల సరిహద్దులు, పేర్లు, మండలాల మార్పునకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న గోపాలపురం నియోజకవర్గాన్ని ఏలూరు జిల్లాలోకి మార్చేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు సమాచారం. పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా జిల్లా కేంద్రాల దూరాన్ని తగ్గించాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ మార్పులు చేస్తోంది.
గతంలో ప్రజల అభిప్రాయం మేరకే..
గోపాలపురం నియోజకవర్గంలో ద్వారకాతిరుమల, నల్లజర్ల, దేవరపల్లి, గోపాలపురం మండలాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో జిల్లాల విభజన జరిగిన సమయంలో గోపాలపురం నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో కలపాలని నిర్ణయించినప్పుడు, ద్వారకాతిరుమల మండల ప్రజలు తమ మండలాన్ని ఏలూరు జిల్లాలో కలపాలని రాజకీయ పార్టీలకు అతీతంగా ఆందోళనలు చేశారు. అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు చినవెంకన్న కొలువైన ద్వారకాతిరుమల మండలాన్ని ఏలూరు జిల్లాలో చేర్చాలని పట్టుబట్టారు. ప్రజాభీష్టం మేరకు అప్పటి ప్రభుత్వం ద్వారకాతిరుమల మండలాన్ని ఏలూరు జిల్లాలో, మిగిలిన మూడు మండలాలు(గోపాలపురం నియోజకవర్గాన్ని) తూర్పుగోదావరి జిల్లాలోకి మార్చారు.
ఆ రెండు మండలాల వారికి ఇబ్బందే
గోపాలపురం, దేవరపల్లి మండలాల వారికి తూర్పుగోదావరి జిల్లా కేంద్రం ప్రస్తుతం దగ్గరగా ఉంది. దేవరపల్లి నుంచి రాజమండ్రికి 33 కిలోమీటర్లు, గోపాలపురం నుంచి 39 కిలోమీటర్లు, నల్లజర్ల నుంచి 52 కిలోమీటర్లు దూరం. అదే ఈ మూడు మండలాలను ఏలూరు జిల్లాలోకి మారిస్తే దూరం పెరుగుతుంది. దేవరపల్లి నుంచి ఏలూరుకు 66 కిలోమీటర్లు, గోపాలపురం నుంచి 75 కిలోమీటర్లు, నల్లజర్ల నుంచి 45 కిలోమీటర్లు దూరం ఉంది. మండల శివారు గ్రామాల వారికి దూరం మరింత పెరుగుతుంది.
సోషల్ మీడియాలో మొదలైన రచ్చ
దేవరపల్లి, గోపాలపురం, నల్లజర్ల మండలాలను ఏలూరు జిల్లాలో మార్చేప్రయత్నం జరుగుతున్న నేపథ్యంలో ఆ మండలాల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొందరు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను బహిర్గతం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా జిల్లాలు మార్చడం సరికాదని, గోపాలపురం నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలోనే ఉంచాలని పోస్టులు పెడుతున్నారు. దీనిపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆలోచన చేయాలని కోరుతున్నారు. మరి కొందరు పార్టీలకు అతీతంగా ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలపాలని పోస్టులు పెడుతున్నారు.
పరిగణనలోకి తీసుకుంటారా..
జిల్లాల సరిహద్దులు, పేర్లు, మండలాల మార్పులు చేసేటప్పుడు ప్రజాభిప్రాయాలను కూటమి ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందా.? లేక సబ్ కమిటీ సూచనలనే అమలు చేస్తుందా.. అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా గోపాలపురం నియోజ కవర్గాన్ని ఏలూరు జిల్లాలో కలిపే అంశంపై కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
గోపాలపురం నియోజకవర్గ
ముఖచిత్రం
తెరమీదకొచ్చిన గోపాలపురం నియోజకవర్గం
గోపాలపురం, దేవరపల్లి మండలాలను ఏలూరు జిల్లాలో కలపొద్దని డిమాండ్
నల్లజర్ల మండలం ఎటున్నా ఓకే..