
సేంద్రియ ఎరువుల తయారీపై శిక్షణ
ద్వారకాతిరుమల: రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుత సంవత్సరంలో 3.5 లక్షల మంది రైతులను ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకురావడమే లక్ష్యంగా రైతు సాధికార సంస్థ పనిచేస్తోందని ఆ సంస్థ ప్రకృతి వ్యవసాయ విభాగం ప్రాజెక్ట్ అధికారి రాథోడ్ ప్రవీణ్ తెలిపారు. మండలంలోని గుండుగొలనుకుంట గ్రామంలోని బయో రిసోర్స్ సెంటర్ యూనిట్‌లో ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన 50 మంది బయో రిసోర్స్ సెంటర్ యజమానులకు బుధవారం శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాథోడ్ ప్రవీణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయంలో సాగు విస్తీర్ణాన్ని పెంచే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో మరిన్ని బయో రిసోర్స్ సెంటర్లను ఏర్పాటుచేసి, రాష్ట్రస్థాయి నిపుణులతో రిసోర్స్ ట్రైనర్లకు శిక్షణ అందించి, వారి ద్వారా బయో రిసోర్స్ సెంటర్ యజమానులకు ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ ఎరువుల వినియోగంలో శిక్షణ అందిస్తామన్నారు. ఏలూరు ప్రకృతి వ్యవసాయం డీపీఎం వెంకటేష్, బయో రిసోర్స్ సెంటర్ యజమానులు గోపాల్ కృష్ణ, వెంకటరత్నాజీ, డీపీఎంయూ నుంచి జతిన్ (కమ్యూనికేషన్ ఇంటర్న్), ఎస్‌పీఎంయూ బృంద సభ్యులు పాల్గొన్నారు. వారు జీవ ఉత్పత్తుల నాణ్యత, బీఆర్‌సీ యూనిట్ల నిర్వహణ, ప్రకృతి వ్యవసాయం వల్ల నేల, మానవ ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలపై మార్గనిర్దేశం చేశారు.