
అద్దె యజమానుల హడల్
సాక్షి, భీమవరం: ఊహించినట్టే మహిళలకు ఫ్రీ బస్సు హామీని చంద్రబాబు సర్కారు తుస్సుమనిపించింది. జిల్లాలోని పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు మాత్రమే ఉచిత ప్రయాణాన్ని పరిమితం చేసింది. ఈ సర్వీసులు జిల్లాలో 197 ఉండగా వీటిలో 40 శాతం అద్దె బస్సులే ఉన్నాయి. ప్రయాణీకుల రద్దీ పెరిగితే తమ బస్సుల మైలేజీ పడిపోయి మెయింటినెన్స్ పెరిగిపోతుందన్న ఆందోళనలో హైర్ బస్సుల యజమానులు ఉన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు రాష్ట్రమంతటా ప్రయాణం ఉచితమంటూ ఎన్నికల్లో ఊదరగొట్టిన కూటమి ప్లేటు ఫిరాయించింది. ఈ హామీ అమలుకు ఏడాదికి పైగా ఎగనామం పెట్టింది. ఇప్పుడు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు మాత్రమే ఫ్రీ అంటూ చేతులెత్తేసింది. ఏసీ, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, నాన్‌స్టాప్ సర్వీసుల్లో టిక్కెట్ తీసుకోవాల్సిందేనని స్పష్టంచేసింది. జిల్లాలోని భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం డిపోల పరిధిలో డిపోల పరిధిలో వెన్నెల, స్టార్‌లైనర్, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, పల్లె వెలుగు తదితర బస్సులు 295 ఉన్నాయి. ఇవి మొత్తం రోజుకు లక్ష కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తుండగా, 90 వేల మంది ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తున్నారు.
40 శాతం హైర్ బస్సులే
ఉచిత ప్రయాణానికి నిర్ణయించిన పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులు 197 ఉన్నాయి. వీటిలో 73 సర్వీసులను అద్దెకు తీసుకుని నడుపుతున్నారు. హైర్ బస్సులకు 56 సిటీంగ్ కెపాసిటీ ఉండాలి. లీటరు డీజిల్‌కు 5.6 కిలోమీటర్లు ప్రయాణించాలి. మైలేజ్ షార్టేజ్ వస్తే ఆ భారాన్ని తామే భరించాలని యజమానులు అంటున్నారు. మెయింటినెన్స్ కింద ఒప్పందం మేరకు కిలోమీటరుకు రూ.12 నుంచి రూ.13 చొప్పున ఇస్తున్నారు. ఫ్రీ బస్సు వలన ప్రయాణీకుల రద్దీ పెరుగుతుందని వారంటున్నారు. ఓవర్‌లోడ్ వలన టైర్లు అరుగుదల, ఇంజన్ సంబంధిత సమస్యలు తలెత్తి మెయింటినెన్స్ పెరిగిపోతుంది. ఆయిల్ షార్టేజీ వస్తుందని యజమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఆయిల్ షార్టేజీ వల్ల నెలకు రూ.5 వేల వరకు నష్టపోతుండగా రద్దీతో ఈ నష్టం రూ.20 వేలకు పెరిగే అవకాశముందంటున్నారు. మెయింటినెన్స్ నెలకు రూ.30 వేలు వరకు ఖర్చవుతుంటే రెట్టింపు అవుతుందని చెబుతున్నారు. రవాణశాఖ నిబంధనలు మేరకు సిటీంగ్ కెపాసిటీ 56 మందికే ప్రీమియం చెల్లిస్తామని, ఓవర్ లోడ్‌తో అనుకోని ప్రమాదం జరిగితే బీమా కొందరికే వర్తిస్తుందని చెబుతున్నారు. నిర్ణీత సమయం కంటే ఆలస్యమైతే తమకు పెనాల్టీలు వేస్తున్నారని, రద్దీ వల్ల జరిగే జాప్యానికి తమనే బాధ్యుల్ని చేస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అగ్రిమెంట్‌లో ఫ్రీ బస్సు ప్రస్తావన లేదని, ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు మైలేజీ లీటరుకు 5.6 కి.మీ నుంచి 4.6 కి.మీ తగ్గించాలని, మెయింటినెన్స్ కి.మీ రూ.13 నుంచి రూ. 18కు పెంచాలని యజమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళనకు సిద్ధమవుతున్నట్టు జిల్లాకు చెందిన నాయకులు తెలిపారు.
ఇప్పటికే నష్టపోతున్నాం
ఎంఎస్‌ఎంఈలో బస్సు తీసుకుని ఆర్టీసీలో హైర్‌కు నడుపుతున్నాను. నెలకు రూ.1.4 లక్షల వరకు వస్తుంది. బస్సు ఫైనాన్స్ రూ.90 వేలు, డ్రైవర్ల జీతం రూ.40 వేలు, క్లీనర్‌కు రూ.6 వేలు, మెయింటినెన్స్ రూ.30 వేలు పోగా నెలకు రూ.30 వేలు నష్టం వస్తుంది. ఫ్రీ బస్సు వల్ల రద్దీ పెరిగి మైలేజీ షార్టేజీ, మెయింటినెన్స్ పెరిగిపోతాయి. ఈ మేరకు చార్జీల్లో మార్పులు చేయాలి.
– రాపాక మహేష్, హైర్ బస్ యజమాని, సిద్ధాంతం
జిల్లాలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసులు 197
వీటిలో 40 శాతం అద్దె బస్సులే
56 సీటింగ్ కెపాసిటీతో నడిపేందుకు ఆర్టీసీతో ఒప్పందం
ఇప్పుడు ఉచితంతో రద్దీ పెరుగుతుందంటున్న బస్సు యజమానులు
మైలేజీ పడిపోయి, నిర్వహణ పెరుగుతుందని ఆందోళన
మైలేజీ పరిమితి తగ్గించాలని, నిర్వహణ ఖర్చు పెంచాలని డిమాండ్
సర్వీసులు మొత్తం అద్దె
బస్సులు బస్సులు
వెన్నెల 1 1
స్టార్ లైనర్ 4 –
ఇంద్ర 11 –
సూపర్ లగ్జరీ 33 –
అల్ట్రా డీలక్స్ 26 1
ఎక్స్‌ప్రెస్ 20 9
అల్ట్రా పల్లెవెలుగు 19 17
పల్లెవెలుగు 158 47
స్పేర్ 23 –