
పుంత రోడ్లు ఎక్కడ?
పొలాలకు వెళ్లే దారిలేక ఆక్వా, వరి రైతుల అవస్థలు
ఉండి: చోట్ల పుంత రోడ్లు ఆక్వా, వరి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో పుంతలు, కాలువ గట్లపై రోడ్లు లేకపోవడంతో చేలకు వెళ్లాలన్నా, పొలాలకు ఎరువులు, పురుగు మందులు, ఆక్వా చెరువులకు మేత తీసుకుపోవాలన్నా రైతులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. పుంతలు లేని చోట్ల రోడ్లు వేసి రైతులకు అండగా నిలబడతామని చెప్పే ప్రజా ప్రతినిధులు ఉండి నియోజకవర్గంలో వందలాది పుంతలు, కాలువ గట్లపై రోడ్లు లేక రైతులు ఇక్కట్లు పడుతుంటే పట్టించుకోవట్లేదు. వందలాది పుంతలపై రోడ్లు వేయాల్సి ఉండగా.. పాములపర్రులో శ్మశాన వాటికను పుంతగా చూపిస్తూ రోడ్డు వేయడానికి మాత్రం హడావుడి చేస్తున్నారు. అడుగు వేస్తే జారిపడిపోయే పరిస్థితుల్లో పుంతరోడ్లు ఉండగా వరి పొలాలకు ఎరువులు, ఆక్వా చెరువులకు మేతలు వంటివి తీసుకువెళ్ళేందుకు రైతులు అదనపు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
అదనపు ఖర్చుతో రైతుల ఇక్కట్లు
చేపలు, రొయ్యలు పట్టుబడి చేసేందుకు అదనపు ఖర్చుతో రైతులు భయపడిపోతున్నారు. వేసవి సమయంలో చెరువుల వద్దకు వెళ్ళే వాహనాలు ఇప్పుడు మెయిన్‌రోడ్డు కూడా దిగలేకపోవడంతో పట్టుబడి పట్టిన సరుకును మెయిన్‌రోడ్డుకు చేర్చేందుకు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో ఆక్వా రైతులు మరింత నష్టాల్లోకి వెళ్లిపోతున్నారు. అమెరికా సుంకాల భయాలతో ఇప్పటికే రైతులు తీవ్ర నిరాశలో ఉండగా.. పట్టిన సరుకు ఒడ్డుకు చేర్చేందుకు అదనపు ఖర్చుచేయాల్సి రావడంతో మరింత ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తోంది.
పుంత రోడ్లు ఎప్పుడు వేస్తారు?
నియోజకవర్గంలో వందలాది పుంతల్లో రోడ్ల నిర్మాణం చేయాలని రైతులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. రైతుల ప్రయోజనం కోసం పుంత రోడ్డు నిర్మిస్తున్నామంటూ కబుర్లు చెబుతున్నారు. రైతులు గగ్గోలు పెడుతున్న పుంతల్లో, కాలువ గట్లపై రోడ్లు వేయాలి.
– దానం విద్యాసాగర్, న్యాయవాది, పాములపర్రు
దళితుల ప్రాంతమే కావాలా?
పుంతరోడ్ల నిర్మాణానికి మేం వ్యతిరేకం కాదు. పుంతలేని ప్రాంతంలో ఉందని చెప్పి కేవలం ఇద్దరు ఆక్వారైతుల కోసం అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి రోడ్డు వేస్తారా? దళితుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించి రోడ్డు వేయడం ఏంటి?
– తాళ్ళూరి మధు, బహుజన జేఏసీ కన్వీనర్
మా శ్మశానం
జోలికి రావద్దు
రైతులు మా జోలికి రాలేదు. మేం వారి జోలికి వెళ్ళలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని కొందరు స్వార్థపరులు అవకాశమే లేని చోట రోడ్డు వేయమంటున్నారు. మా శ్మశానం జోలికి ఎవ్వరూ రావద్దు. ఒకరినొకరు గౌరవించుకుంటూ ముందుకు సాగుదాం.
– దర్శి సాల్మన్,
వార్డు సభ్యుడు, పాములపర్రు