
డిప్యూటీ స్పీకరైతే.. చట్టాలు మీరి వ్యవహరిస్తారా?
ఉండి: డిప్యూటీ స్పీకరైతే చట్టాలను అతిక్రమించి వ్యవహరిస్తారా? అని ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజుపై మాజీ ఎమ్మెల్యే దిగుబాటి రాజగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని పాములపర్రు దళితుల శ్మశానంలో నుంచి ఇద్దరు ఆక్వా రైతుల కోసం రోడ్డు వేసే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అడ్డుకున్న దళితులపై పోలీసులు దాడులు చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ వ్యవహారం రోజురోజుకూ తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి (కేవీపీఎస్) నాయకుల బృందం మంగళవారం పాములపర్రులో పర్యటించింది. మాజీ ఎమ్మెల్యే దిగుబాటి రాజగోపాల్ దాడులు చేసిన ప్రాంతాన్ని, రోడ్డు వేయాలని భావిస్తున్న శ్మశాన భూమిని స్థానిక దళితులు, బృంద సభ్యులతో కలసి పరిశీలించారు. రాజగోపాల్ మాట్లాడుతూ దళితులకు రక్షణగా ఉన్న చట్టాలు, జీవోలను పక్కన పెట్టి, వారి జోలికిరావడం చాలా దారుణమని అన్నారు. శ్మశాన భూమి హద్దులు మార్చాలని గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎలా కోరతారని ఆయన ప్రశ్నించారు. తహసీల్దారు పంచాయతీ కార్యదర్శి ద్వారా ఎలా తీర్మానం తీసుకుంటారని నిలదీశారు. నాలుగో తేదీన కార్యదర్శి లేఖ రాస్తే ఐదో తేదీన శ్మశాన సరిహద్దులు మారుస్తూ తహసీల్దారు ఆర్డర్ ఇచ్చేస్తారా? అంటూ మండిపడ్డారు. పేదవారు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేస్తే అధికారులకు వారాలు, నెలలు పడతాయి కానీ.. భూస్వాములకు కొమ్ముకాస్తే మాత్రం ఒక్కరోజు కూడా సమయం అవసరం లేకుండానే ఆర్డర్‌లు ఇచ్చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా ఎమ్మెల్యే, అధికారులు కలసి ఆడిన నాటకమని తీవ్రంగా మండిపడ్డారు. అందుకే అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.
దమ్ముంటే ఆక్రమణలు బయటపెట్టాలి
డిప్యూటీ స్పీకర్, రఘురామకృష్ణరాజుకు దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే నియోజకవర్గంలో ఎంత ఆక్రమణ ఉందో తెలుసుకునేందుకు సర్వే చేయించి దాని వివరాలు పంచాయతీ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచాలని రాజగోపాల్ సవాల్ చేశారు. పేదల శ్మశానం ఆక్రమణ అంటారా.. ఎవరు ఆక్రమణదారులో తెలుస్తుంది అంటూ మండిపడ్డారు. కేవీపీఎస్ జిల్లా బృందం సభ్యులు క్రాంతి బాబు, విజయ్‌లతో కలసి ఈ ఘటనపై పోరాటం మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఇంతటితో ముగించకపోతే నియోజకవర్గమంతా ఇదే సమస్య తలెత్తుతుందని చెప్పారు. రోడ్డు వేసేందుకు ముందుకు వెళితే అన్ని రాజకీయ పార్టీలు, దళిత సంఘాలతో కలసి ముందుకు వెళ్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కోర్టులో కేసులు వేస్తామన్నారు. ఇప్పటికై నా రోడ్డు నిర్మాణం విరమించుకోకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తాం, చలో పాములపర్రుకు పిలునిస్తాం.. కలెక్టర్‌ను కలుస్తాం.. ఇలా పాములపర్రు దళితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని తేల్చిచెప్పారు. తాను పదేళ్ళు ఎమ్మెల్యేగా పనిచేశానని గుర్తుచేశారు. ఉండి నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలంటే వెంటనే శ్మశానంలో రోడ్డు వేసే ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
మాజీ ఎమ్మెల్యే దిగుబాటి రాజగోపాల్
పాములపర్రు ఘటనపై గ్రామంలో పర్యటన
భూస్వాములకు అండగా ఉండి దళితులను వేధిస్తారా? అని ఆగ్రహం