
ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించాలి
భీమవరం: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో జీవనోపాధి కోల్పోతున్న ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయంగా ఉపాధి కల్పించాలంటూ మంగళవారం భీమవరం కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు యింటి సత్యనారాయణ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ పట్టణాల ఆటో యూనియన్ల నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో కలెక్టరేట్‌కు చేరుకుని ఆందోళన చేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు యింటి సత్యనారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల అమలులో భాగంగా ఈ నెల 15 నుంచి మహిళలకు ఫ్రీ బస్ అమలుచేయడం వల్ల జిల్లాలో 16 వేల మంది ఆటో కార్మికులు ఉపాధిని కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉచిత బస్సు కారణంగా వీరంతా రోడ్డున పడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆటో వర్కర్స్‌కు ప్రత్యామ్నాయంగా ఏదైనా ఉపాధి అవకాశాలు కల్పించాలని, కార్మికులకు తగిన న్యాయం చేసేంతవరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్‌లో వినతిపత్రం అందచేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు కట్రెడ్డి వెంకటేశ్వరరావు, తలారి వాసు, టివీకే రాంబాబు, పంపన గోపీ, చెన్నెంశెట్టి వాసు, సంజీవరావు, దుర్గారావు, ములుగుర్తి కృష్ణ, పాలవలస జగన్‌మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.