
‘వికసిత్ భారత్’పై వర్క్‌షాప్
భీమవరం (ప్రకాశంచౌక్): వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేసుకోవడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వికసిత్ భారత్ లక్ష్యంగా పాఠశాల విద్య అనే అంశంపై వర్క్ షాప్‌లో కలెక్టర్ పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వికసిత్ భారత్ లక్ష్యాలను వివరించారు. ఈ వర్క్ షాప్‌లో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్, విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ పాల్గొన్నారు.
నులిపురుగులను నులిమేద్దాం
భీమవరం అర్బన్: పిల్లలు, విద్యార్థులు నులిపురుగుల నివారణ మాత్రలను వేసుకుని కడుపులోనే నులి పురుగులను నులివేద్దామని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. మండలంలోని చినఅమిరంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా మంగళవారం నులిపురుగు నివారణ మాత్రలను పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ప్రారంభించి మాట్లాడారు. 19 ఏళ్ల లోపు వారందరూ తప్పనిసరిగా నులిపురుగుల నివారణ మాత్రలు వేసుకుని ఆరోగ్యంగా ఉండాలన్నారు. తప్పనిసరిగా నులి పురుగుల నివారణ మాత్రలను వేసేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, అధికారులు శ్రద్ధ తీసుకోవాలన్నారు.