
వీధి కుక్కల దాడిలో గాయాలు
భీమడోలు: భీమడోలు మండలంలోని పలు గ్రామాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేసి దాడి చేశాయి. వేర్వేరు గ్రామాలకు చెందిన వీధి కుక్కల బాధితులు సోమవారం భీమడోలు ఆసుపత్రికి వచ్చారు. వారికి వైద్యులు యాంటీ రాబీస్ వ్యాక్సిన్ వేసి ఇళ్లకు పంపారు. పోలసానిపల్లికి చెందిన నాలుగేళ్ల చిన్నారి షేక్ అమ్మన్, భీమడోలు పంచాయతీ శివారు ఆర్జావారిగూడెంకు చెందిన పాము సుశాంత్(24), ఉమర్(9), మాధవరానికి చెందిన మడిచారాల ఆదిలక్ష్మీ(41), ఎం.నాగులపల్లికి చెందిన తులసి రామ్(34), సండ్రగుంటకు చెందిన కె.రాజు(66), గుణ్ణంపల్లికి చెందిన నక్కా చంద్రవతి(70) వీధి కుక్కల దాడిలో గాయపడ్డారు. కుటుంబ సభ్యులు భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆసుపత్రి సూపరిండెంటెంట్ ఆనంద్ ఆధ్వర్యంలో వ్యాక్సిన్ వేశారు. ఇటీవల భీమడోలు సమీపంలోని ఎం.నాగులపల్లి పంచాయతీ పరిధిలో ఓ ప్రైవేటు పాఠశాలలోకి కుక్కలు చొరబడి ముగ్గురు విద్యార్థులను కరిచాయి. గ్రామాల్లో వీధి కుక్కల సంచారం పెరిగి పోయిందని, వాటి నుంచి ప్రజలను రక్షించాలని గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు.

వీధి కుక్కల దాడిలో గాయాలు