
శ్శశాన భూమి హద్దులు మార్చేందుకు కుట్ర
దళిత మహిళల నిరసన
ఉండి: పాములపర్రు ఘటనలో శ్శశాన వాటిక భూ మి రికార్డుల తారుమారుపై పంచాయతీ కార్యదర్శి అప్పారావును నిలదీసేందుకు వెళ్లిన దళిత మహిళలకు నిరాశ ఎదురైంది. శ్శశాన భూమిపై వాదోపవాదాలు, దళితులపై దాడి జరిగిన ఘటనల నేపథ్యంలో గ్రామానికి కొత్తగా వచ్చిన పంచాయతీ కార్యదర్శి శ్శశాన భూమి సరిహద్దులు మార్చాలంటూ పంచాయతీ పాలకవర్గానికి, దళితులకు సమాచారం లేకుండా తహసీల్దార్‌కు లేఖ రాశారు. దీంతో అధికారులు ఆఘమేఘాలపై శ్శశాన భూమి సరిహద్దులు మార్చేయడంపై దళితులు ఉలిక్కిపడ్డారు. దీనిపై ఆరా తీసేందుకు సోమవారం ఉదయం పంచాయతీ కార్యాలయానికి వెళ్లగా పంచాయతీ కార్య దర్శి రాలేదు. కార్యాలయంలో ఉన్న సచివాలయ ఉద్యోగులు తమకేమీ తెలియదని చెప్పారు. కార్యదర్శికి ఫోన్ చేసినా స్పందించకపోవడంతో సాయంత్రం వరకు కార్యాలయం వద్దనే కూర్చుని దళిత మహిళలు తిరిగి వెళ్లిపోయారు. పంచాయతీ కార్యాలయంలో తమకు సమాధానం చెప్పేవారే లేరని, అధికారులు చిన్నచూపు చూస్తున్నారంటూ దళిత మహిళలు ఆరోపించారు. శ్మశానంలో రోడ్డు వే యాలని పట్టుదలకు పోవడంతో రికార్డులు తారుమారుతో కుట్ర జరుగుతుందనే అనుమానం కలుగుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎంపీడీఓ శ్రీనివాస్‌ను ఆరా తీయగా పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌కు కలిసిపూడి, పాములపర్రు రెండు పంచాయతీల బాధ్యతలు ఉన్నాయని, సోమవారం కలిసిపూడిలో ఉన్నారన్నారు. ఎంపీడీ ఓ కార్యాలయానికి కూడా వచ్చి వెళ్లారని చెప్పారు.