ముసునూరు: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకుని సీజ్ చేసినట్లు నూజివీడు సివిల్ సప్లయి స్పెషల్ డిప్యూటీ తహసీల్దార్ గుండుబోయిన వెంకటేశ్వరరావు తెలిపారు. బాపులపాడు మండలం కాకులపాడు ప్రాంతం నుంచి వాహనంలో మండలంలోని గుళ్ళపూడి మీదుగా అక్రమంగా తరలిస్తున్న 41 క్వింటాళ్ల రేషన్ బియ్యంను ఏలూరు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల ఆధ్వర్యంలో గురువారం తెల్లవారుజామున దాడి చేసి పట్టుకున్నామన్నారు. బియ్యాన్ని తరలిస్తున్న కడలి లక్ష్మణరావు, ధనికొండ గోపిరాజు, బండారు నాగబాబు, కొల్లి కాసులు, షేక్ ఖాసింబాబులపై ముసునూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
నేడు ఏలూరులో కోకో రైతుల రాష్ట్ర సమావేశం
ఏలూరు (టూటౌన్): ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర సమావేశం ఏలూరు పవర్‌పేటలోని అన్నే భవనంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కోకో గింజల ధర కిలోకు రూ. 500 నుంచి రూ. 350కు క్రమంగా తగ్గించివేయడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. కోకో రైతుల సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని శ్రీనివాస్ తెలిపారు.
బైక్ దొంగల అరెస్టు
ఆకివీడు: ఇద్దరు దొంగలను పట్టుకుని వారి నుంచి తొమ్మిది మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆకివీడు రూరల్ సీఐ జగదీశ్వరరావు, ఎస్సై హనుమంతు నాగరాజు తెలిపారు. నిందితులు కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం ఎండపల్లి గ్రామానికి చెందిన కూనసాని నాగాంజనేయులు, ఆకివీడు మండలం చినకాపవరం గ్రామానికి చెందిన కుప్పల రమేష్‌లను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచామన్నారు. డీఎస్పీ జయ సూర్య పర్యవేక్షణలో ఉండి ఎస్సై నజీరుల్లా, విజయ్, శివ, శంకర్, రత్నంల సహకారంతో కేసును ఛేదిచామన్నారు.
22న సీజీఆర్‌ఎఫ్ క్యాంపు కోర్టు
సీజీఆర్‌ఎఫ్ చైర్‌పర్సన్ సత్యనారాయణ
సాక్షి, విశాఖపట్నం: ఏపీఈపీడీసీఎల్ శ్రీకాకుళం, అనకాపల్లి, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, పాడేరు సర్కిళ్ల విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 11 నుంచి క్యాంపు కోర్టులు నిర్వహించనున్నట్లు విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (సీజీఆర్‌ఎఫ్) చైర్మన్ విశ్రాంతి జడ్జి బి.సత్యనారాయణ వెల్లడించారు. ఇందులో భాగంగా ఈనెల 22న భీమవరం డివిజన్ ఉండి సెక్షన్ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు జరిగే క్యాంపు కోర్టులో వినియోగదారులు పాల్గొనవచ్చని తెలిపారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, హెచ్చుతగ్గులు, బిల్లుల సమస్యలు, కొత్త సర్వీసుల జారీలో జాప్యం తదితర సమస్యలపై వినియోగదారులు నేరుగా సీజీఆర్‌ఎఫ్ కమిటీకి తెలియజేయవచ్చన్నారు. సదస్సుల్లో చైర్‌పర్సన్ బి.సత్యనారాయణతో పాటు సీజీఆర్‌ఎఫ్ కమిటీ సభ్యులు ఎస్.రాజబాబు, ఎస్.సుబ్బారావు, ఎన్.మురళీకృష్ణ పాల్గొననున్నారు.

రేషన్ బియ్యం పట్టివేత