
యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కారుమూరి సునీల్
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కారుమూరి సునీల్ కుమార్‌ను నియమించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జోన్ –2 వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సునీల్ కుమార్‌ను నియమించినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. ఈ మేరకు జోన్ –2 పరిధిలోని కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో సునీల్ పార్టీ యువజన విభాగానికి నాయకత్వం వహించనున్నారు. ఆయన నియామకంతో పార్టీ యువజన విభాగం మరింత బలోపేతమవుతుందని పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి.
స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ఆపాలి
నరసాపురం: స్మార్ట్ మీటర్ల ఏర్పాటు వెంటనే నిలుపుదల చేయాలంటూ ప్రజా వేదిక నరసాపురం ఆధ్వర్యంలో నరసాపురం విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ప్రజా వేదిక జిల్లా కమిటీ సభ్యుడు మామిడిశెట్టి రామాంజనేయలు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టండి అని చెప్పిన కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాక విద్యుత్ భారాలతో ప్రజల నడ్డి విరగ్గొడుతుందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 14 నెలలకే రూ.15,485 కోట్లు ప్రజల నుంచి దోపిడీ చేసిందన్నారు. అదానీ కంపెనీ లాభాల కోసం కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల విషయంలో ప్రజలను తీవ్రంగా మోసం చేస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. స్మార్ట్ మీటర్లు రద్దు చేయకపోతే ప్రజా ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు పి.నారాయణరావు, కె.శ్రీనివాసు, బి.జోగేశ్వరావు, జి.నాగేశ్వరరావు, ఎన్.కొండ, పి.కామేశ్వరరావు, పి.అప్పల నాయుడు, కె.రవి,లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
అసమానతలు తొలగించడం పీ4 లక్ష్యం
భీమవరం (ప్రకాశంచౌక్): సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగించడమే పీ4 ప్రధాన లక్ష్యమని ఇన్‌చార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. పీ4లో భాగంగా విద్యా శాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సమాజంలో 10 శాతంగా ఉన్న ధనవంతులు, అట్టడుగు స్థాయిలో ఉన్న 20 శాతం మంది నిరుపేదలకు చేయూత నివ్వడమే పి4 లక్ష్యమన్నారు. ఉన్నత స్థాయిలో ఉన్న పూర్వపు విద్యార్థులకు కూడా పీ4 పై అవగాహన కల్పించి వారు మార్గదర్శకులుగా చేరి బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా ప్రోత్సహించాలని అన్నారు. ఉపాధ్యాయులు కూడా స్వచ్ఛందంగా మార్గదర్శకులు కావచ్చన్నారు. సమావేశంలో డీఈఓ ఇ.నారాయణ తదితరులు పాల్గొన్నారు.
చట్టంపై విద్యార్థులకు అవగాహన
ఏలూరు (టూటౌన్): నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ అన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ, రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ అమరావతి ఆదేశాల ప్రకారం శ్రీజాతీయ న్యాయ సేవాధికార సంస్థ–బాలల స్నేహ పూర్వక న్యాయ సేవల పథకం 2024పై అవగాహన కల్పించేందుకు ఆక్స్‌ఫర్డ్ ఒలింపియాడ్ స్కూలు విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కె.రత్నప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు బాధ్యతలు కూడా తెలుసుకుని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయరాదని, గుడ్ టచ్ బాడ్ టచ్ పైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కారుమూరి సునీల్