
టీడీపీ గూండాల దాడి హేయం
భీమడోలు: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్, నాయకులపై పులివెందులలో టీడీపీ గుండాలు చేసిన దాడి అత్యంత హేయమని పార్టీ రాష్ట్ర బీసీ సెల్ వర్కింగ్ అధ్యక్షుడు నౌడు వెంకటరమణ ఓ పత్రికా ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు తెగబడడం హేయమైన చర్య అన్నారు. టీడీపీలో పెదబాబు, చినబాబుకు భయం పట్టుకుందన్నారు. జగన్‌మోహనరెడ్డి రోడ్డుపైకి వస్తే చాలు టీడీపీకి భయమని, అందుకే పార్టీ శ్రేణులపై పచ్చ గుండాలు దాడులు చేస్తున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం తీరును మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. దాడి చేసిన గుండాలను కఠినంగా శిక్షించాలని కోరారు. దాడికి నిరసనగా నేడు బీసీ సెల్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు.
విద్యాసంస్థల బస్సులపై కేసుల నమోదు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు జిల్లావ్యాప్తంగా మోటారు వాహనాల తనిఖీ అధికారులు బుధవారం విద్యాసంస్థల బస్సులను తనిఖీ చేశారు. వివిధ ఉల్లంఘనలకు పాల్పడినందుకు 15 కేసులు నమోదు చేసి, రూ.26 వేలు జరిమానా విధించినట్లు ఉప రవాణా కమిషనరు షేక్ కరీమ్ తెలిపారు. వాహనదారులు లైసెనన్స్‌తో పాటు సంబంధిత వాహన పత్రాలను ఉంచుకోవాలని, రహదారి భద్రతా నియమాలను తప్పక పాటించాలన్నారు. నిబంధనలు పాటించని విద్యాసంస్థల బస్సులను, ప్రైవేటు వాహనాలను సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు.