
మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య
మండవల్లి : భార్యాభర్తల నడుమ చిన్నపాటి విభేదాల కారణంగా మనస్తాపంతో విషం తాగి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం ప్రత్తిపాడులో బుధవారం చోటుచేసుకుంది. మృతురాలు ప్యారా సుధారాణి(35)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని ఏలూరు ఆస్పత్రిలో భద్రపరిచారు.
గ్యాస్ బండ మీద పడి.. డెలివరీ బాయ్ మృతి
చింతలపూడి: స్థానిక బోయగూడెం గ్రామానికి చెందిన బందెల హానోక్ (30) గ్యాస్ బండ మీదపడి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హానోక్ స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ గ్యాస్ కంపెనీలో గ్యాస్ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం ఊటసముద్రం గ్రామానికి గ్యాస్ బండలు డెలివరీ చేయడానికి వెళ్లి వాహనం నుంచి గ్యాస్ బండలు దించుతుండగా ప్రమాదానికి గురయ్యాడు. దీంతో తలకు బలమైన గాయాలు అవ్వడంతో వెంటనే స్థానికులు చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హానోక్ మృతి చెందడంతో బోయగూడెంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు గ్యాస్ కంపెనీ నిర్వాహకులను కోరగా నిరాకరించడంతో దళిత సంఘాల ఆధ్వర్యంలో గురువారం ఆందోళనకు దిగుతున్నట్లు తెలిపారు.