స్మార్ట్‌ షాక్‌ | - | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ షాక్‌

Aug 5 2025 11:04 AM | Updated on Aug 5 2025 11:04 AM

స్మార

స్మార్ట్‌ షాక్‌

స్మార్ట్‌ మీటర్ల వ్యవహారంలో కూటమి తీరుపై ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. ప్రజల ఆందోళనను పట్టించుకోకుండా స్మార్ట్‌ మీటర్ల బిగింపు పనులు చేస్తుండటాన్ని నిరసిస్తూ పోరుబాటకు సిద్ధమయ్యాయి. ఈ మేరకు ప్రజావేదిక ఆధ్వర్యంలో జిల్లా అంతటా మంగళవారం విద్యుత్‌, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళనలకు నిర్ణయించాయి.

అపోహలు వీడాలి

స్మార్ట్‌ మీటర్ల వలన బిల్లులు పెరుగుతాయనేది కేవలం అపోహ మాత్రమే. పాత మీటర్లతో పోలిస్తే వీటి వలన వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుంది. వినియోగదారులు ఎప్పటికప్పుడు ఎంత వినియోగించారో తెలుసుకోవచ్చు. మీటర్ల బిగింపునకు ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు.

– ఎ.రఘునాథబాబు, ఏపీఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ

కార్పొరేట్‌ సంస్థలకు కొమ్ముకాస్తూ..

కార్పొరేట్‌ సంస్థలకు కొమ్ముకాస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెస్తున్న స్మార్ట్‌ మీటర్లు వలన భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సామాన్యులు మోయలేనంతంగా బిల్లులు వస్తాయి. వీటి ఏర్పాటుకు వ్యతిరేకంగా తలపెట్టిన ఆందోళనలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలి.

–గోపాలన్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి

స్మార్ట్‌ మీటర్లతో దోపిడీ

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్‌ మీటర్లను పగలకొట్టండని లోకేష్‌ కూటమి నాయకులకు పిలపునిచ్చారు. ఏడాదిలోనే విద్యుత్‌ చార్జీలు గణనీయంగా పెంచిన కూటమి, మళ్లీ పెంచేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. స్మార్ట్‌ మీటర్లతో వినియోగదారులను దోచుకుంటుంది. అదనపు లోడు పేరుతో డిపాజిట్లుగా భారీ మొత్తాన్ని గుంజుతోంది. ప్రజలు కూటమి ప్రభుత్వానికి డిస్కమ్‌ షాకును ఇవ్వాలి.

– బి.బలరామ్‌, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి

సాక్షి, భీమవరం: జిల్లాలో డొమెస్టిక్‌, కమర్షియల్‌, అగ్రికల్చర్‌, ఇండస్ట్రీయల్‌ 7,33,964 విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా నెలకు 235.16 మి.యూ. విద్యుత్‌ వినియోగమవుతోంది. ఫ్యూయల్‌ పవర్‌ పర్చేజ్‌ కార్డు అడ్జస్ట్‌మెంట్‌ (ఎఫ్‌పీపీపీఏ) పేరిట కూటమి ప్రభుత్వం చార్జీలు పెంచేసింది. ఫిక్స్‌డ్‌, కస్టమర్‌, ఎలక్ట్రిసిటీ డ్యూటీ, సర్‌ చార్జీలు సర్దుబాటు పేరిట వినియోగం కన్నా రెండు, మూడు రెట్లు వస్తున్న బిల్లులతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ఖాళీగా ఉన్న ఇళ్లకు మినిమమ్‌కు బదులు రూ.600లకు పైగా బిల్లు వస్తుంటే, తాజాగా స్మార్ట్‌ మీటర్ల బిగింపు ఆందోళనకు గురిచేస్తోంది.

స్మార్ట్‌ భయం : చార్జీలు పెరిగిపోతాయని వినియోగదారులు, వ్యాపార వర్గాలు, ఉపాధి కోల్పోతామని మీటర్‌ రీడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నా కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. స్మార్ట్‌ మీటర్ల బిగింపు పనులను వేగవంతం చేస్తోంది. తొలిదశగా కమర్షియల్‌, ఇండస్ట్రీయల్‌, స్థానిక సంస్థలకు చెందిన పాత మీటర్ల స్థానంలో స్మార్ట్‌ మీటర్లు అమర్చుతోంది. రానున్న మార్చి నాటికి జిల్లాలో 1.02 లక్షల కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్లు బిగింపు విద్యుత్‌ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు దాదాపు 45 వేలకు పైగా మీటర్లను వేశారు. వీటిలో ప్రభుత్వ కార్యాలయాలకు చెందిన కనెక్షన్లు 34 వేలు వరకు ఉండగా ఇండస్ట్రీయల్‌ 225, విద్యాసంస్థలు 9400, ఆక్వా కనెక్షన్లు 300లు వరకు ఉన్నాయి.

మీటర్‌ రీడర్ల ఉపాధికి ఎసరు

స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుతో తాము ఉపాధి కోల్పోతామన్న ఆందోళనలో మీటర్‌ రీడర్లు ఉన్నారు. జిల్లావ్యాప్తంగా 200 మంది వరకు మీటర్‌ రీడర్లు ఉన్నారు. నెలకు సుమారు రూ.10 వేల వరకు వస్తుంది. స్మార్ట్‌ మీటర్లతో బిల్లు తీసే అవసరం ఉండకపోవడం వలన తాము పని కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరుబాటకు సిద్ధమవుతున్నారు.

నేడు ఆందోళనలకు పిలుపు

స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ ప్రజాసంఘాలు ఇప్పటికే ప్రజావేదికగా ఏర్పడి జిల్లాలోని పలుచోట్ల ఆందోళనలు నిర్వహించాయి. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి పిలుపునిచ్చాయి. అందులోభాగంగా జిల్లాలోని విద్యుత్‌, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళనలు నిర్వహించి అధికారులకు వినతిపత్రాలు అందజేయనున్నట్టు ప్రజాసంఘాల నాయకులు చెబుతున్నారు.

అభ్యంతరాలివిగో..

స్మార్ట్‌ మీటర్ల బిగింపు కేవలం మీటర్లు మార్పు మాత్రమే కాదని, విధాన మార్పుగా విద్యుత్‌ పంపిణీ సంస్థల్ని కార్పొరేట్‌ చేతుల్లో పెట్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రగా ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి.

ప్రస్తుతం కమర్షియల్‌కు మాత్రమేనంటున్నా రానున్న రోజుల్లో గృహావసరాలకు అమర్చుతారన్న అనుమానాలున్నాయి.

సెల్‌ఫోన్‌ తరహాలో ఇక ముందుగానే సొమ్ము చెల్లించి కరెంటు రీచార్జి చేయించుకోవాలి. స్మార్ట్‌ మీటరు ఖర్చు సింగిల్‌ ఫేజ్‌కు రూ.9,000, త్రీఫేజ్‌ కు రూ.17,000లు 93 నెలల వాయిదాల పద్ధతిలో వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు.

మీటరు పాడైతే కొత్త మీటరుకు అయ్యే ఖర్చు వినియోగదారులే భరించాలి.

పగలు కంటే రాత్రి వినియోగానికి అధిక చార్జి వసూలు చేస్తారు. వేసవి కాలంలో చార్జీలను పెంచేస్తారు. వైర్‌లెస్‌ టెక్నాలజీ ద్వారా నిర్వహణ సంస్థ కార్యాలయం నుంచే మీటర్లను ఆపరేట్‌ చేస్తారంటున్నారు.

బిల్లుల్లో తప్పులకు సమాధానం చెప్పే నాథుడు ఉండడు. ఈ మీటర్లతో ప్రజల వ్యక్తిగత గోప్యతకు ప్రమాదం వాటిల్లుతుందనే అనుమానాలు ఉన్నాయి.

విద్యుత్‌ బాదుడు

స్మార్ట్‌ మీటర్లను వ్యతిరేకిస్తున్న ప్రజాసంఘాలు

ఉపాధిపై ఆందోళనలో మీటర్‌ రీడర్లు

పట్టించుకోని ఏపీఈపీడీసీఎల్‌

నేడు విద్యుత్‌, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళనలకు ప్రజావేదిక పిలుపు

జిల్లాలో మొత్తం విద్యుత్‌ కనెక్షన్లు 7,33,964

తొలిదశలో కేటగిరీ–2 సర్వీసులకు స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు

స్మార్ట్‌ షాక్‌ 1
1/3

స్మార్ట్‌ షాక్‌

స్మార్ట్‌ షాక్‌ 2
2/3

స్మార్ట్‌ షాక్‌

స్మార్ట్‌ షాక్‌ 3
3/3

స్మార్ట్‌ షాక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement