
191 అర్జీల స్వీకరణ
భీమవరం (ప్రకాశంచౌక్): అర్జీదారులతో స్వయంగా మాట్లాడి నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపాలని, అర్జీలు రీ ఓపెన్ కాకుండా చూడాలని ఇన్‌చార్జి కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ, గ్రామ, వార్డు సచివాలయ అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పీడీ కేసీహెచ్ అప్పారావుతో కలిసి పీజీఆర్‌ఆర్‌లో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తంగా 191 అర్జీలను స్వీకరించినట్టు ఇన్‌చార్జి కలెక్టర్ తెలిపారు. అనంతరం జిల్లాలో వాట్సాప్ గవర్నెన్స్ అమలు తీరుపై అధికారులతో సమీక్షించారు.
శాశ్వత పరిష్కారం చూపాలి
భీమవరం: పోలీసు శాఖకు వచ్చే ప్రజా ఫిర్యా దులు పరిష్కారానికి ప్రాధాన్యమిస్తూ అర్జీలు పునరావృతం కాకుండా గడువులోపు శాశ్వత పరిష్కారం చూపాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. సోమవారం జిల్లాపోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా 11 మంది నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వారి సమస్యలు తెలుసుకుని సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. అదనపు ఎస్పీ (అడ్మిన్) వి.భీమారావు పాల్గొన్నారు.
దత్తతపై అవగాహన
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌లో ఇన్‌చార్జి కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన దత్తత కార్యక్రమంపై అవగాహన కల్పించారు. పిల్లలు లేని తల్లిదండ్రులు దత్తత తీసుకునేందుకు పాటించాల్సిన నియ మ, నిబంధనలను వివరించారు.
నవోదయ దరఖాస్తులకు గడువు పొడిగింపు
భీమవరం: జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు గడువును పొడిగించినట్టు డీఈఓ ఈ.నారాయణ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పరిపాలన కారణాల వల్ల ఈనెల 13 వరకూ గడువు పొడిగించారని పేర్కొన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో ఈనెల 15న 79వ స్వాతంత్య్ర దినోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో పంద్రాగస్టు వేడుకలపై అధికారులతో సమీక్షించా రు. కలెక్టరేట్ పరేడ్ గ్రౌండ్స్‌ను సుందరంగా తీ ర్చిదిద్దాలని, సాంస్కృతిక ప్రదర్శనలు, స్టాల్స్, శకటాలు తదితర ఏర్పాట్లను అధికారులు సమన్వయంతో పూర్తిచేయాలన్నారు. డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, ఆర్డీఓ కె.ప్రవీణ్ కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ్యాక్టరీల్లో నిబంధనలు తప్పనిసరి
భీమవరం (ప్రకాశంచౌక్): కార్మిక చట్టాలు, ఉపాధికి సంబంధించిన పలు అంశాల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలి ఇన్‌చార్జి కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి అన్నారు. భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం ప్రాన్ ప్రాసెసింగ్ యూనిట్ రైడింగ్ జిల్లాస్థాయి కమిటీ సభ్యులు, అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్ మాట్లాడుతూ ఫ్యాక్టరీల్లో పనిచేసే మహిళా కార్మికుల సంక్షేమానికి నిబంధనలను విధిగా పాటించాలన్నారు. పని గంటలు, పని పరిస్థితులు మెరుగ్గా ఉండాలన్నారు. ఫ్యాక్టరీల్లో ఎక్కడ బాల కార్మికులు ఉండకూడదన్నారు. మంగళవారం నుంచి నెలాఖరు వరకు జిల్లాలోని ప్రాన్ ప్రాసింగ్ యూనిట్లను పరిశీలించి నివేదిక అందజేయాలని కమిటీ సభ్యులను ఆదేశించారు. జిల్లా కార్మిక శాఖ అధికారి ఏ.లక్ష్మి, జిల్లా మత్స్య శాఖ అధికారి నాగలింగాచార్యులు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు.మంగపతిరావు, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ జి.స్వాతి, ఎంపెడా అధికారి గోపాల్ ఆనంద్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎఫ్‌ఈఓ ఎన్.వెంకటరమణ పాల్గొన్నారు.