
ముదురుతున్న రోడ్డు ఏర్పాటు వివాదం
ఉండి: పాములపర్రు గ్రామంలో శ్మశానవాటిక నుంచి రోడ్డు వేయాలని అధికారులు పట్టుదలకు పోవడంతో వివాదం రోజురోజుకు ముదురుతోంది. శ్మశానంలో నుంచి ఆక్వా చెరువులకు రోడ్డు వేయవద్దంటూ గత నెల 31వ తేదీన మొదటిగా దళితులు నిరసన తెలిపారు. దీంతో తహసీల్దార్ నాగార్జున తాను 2వ తేదీ వచ్చి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో దళితులు నిరసన విరమించారు. అయితే శనివారం ఆయన రాకపోగా అధికారులను పంపించి రోడ్డు నిర్మాణానికి కొలతలు వేసే కార్యక్రమం చేపట్టడంతో దళితులు ఒక్కసారిగా పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. దీంతో గ్రామ పెద్దలు వచ్చి నచ్చజెప్పడంతో నిరసన విరమించి మాట్లాడుకునేందుకు అంగీకరించారు. కానీ గ్రామ పెద్దలు గానీ, అధికారులు గానీ రాకపోవడంతో దళిత సంఘాలను సమీకరించి భవిష్యత్ కార్యాచరణపై గ్రామంలో సమావేశమయ్యారు. దారి అడిగిన ఆక్వారైతులు వారి భూములను త్యాగం చేసి రోడ్డు వేసుకోవచ్చు కదా అంటూ దళితులు మండిపడుతున్నారు. పంచాయితీ రికార్డుల్లో కూడా శ్మశానవాటిక భూమి అని ఉందని, దళితులకు పవిత్రమైన శ్మశాన భూమిలో రోడ్డు వేసి మా మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించొద్దని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల జేఏసీ నాయకులు, స్థానిక దళిత నాయకులు, అధికారులు డిప్యూటీ తహసీల్దార్ సూర్యనారాయణరాజు, సీఐ జగదీశ్వర్, ఎస్సై ఎండీ నసీరుల్లా పాల్గొన్నారు.