
రోడ్డెక్కిన ఉపాధ్యాయులు
భీమవరం: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం భీమవరం కలెక్టరేట్ వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం మొండివైఖరి అవలంభిస్తుందని విమర్శించారు. పీఆర్సీ కమిషన్ ప్రకటించి 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని, బకాయి పడ్డ డీఏలను విడుదల చేయాలని, ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి తప్పించి బోధనకే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. మండల విద్యాశాఖ అధికారి పోస్టులను ఉమ్మడి సీనియార్టీ ప్రకారం జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు, ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇవ్వాలని, సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి 2003 ముందు నియమించిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని, సరెండర్ లీవ్ బకాయిలను విడుదల చేయాలన్నారు. ప్రతి హైస్కూల్లో ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం కొనసాగించాలని, 11వ పీఆర్సీ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫ్యాప్టో చైర్మన్ ఎల్.సాయి శ్రీనివాస్, వైఎస్సార్‌టీఏ జిల్లా అధ్యక్షుడు మురాల సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ఫ్యాప్టోను చర్చలకు పిలవకుంటే ఈ నెల 12న రాష్ట్రవ్యాప్తంగా విజయవాడలో ధర్నా చేస్తామని ప్రకటించారు. ధర్నాకు ఎమ్మెల్సీ బి.గోపీమూర్తి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఫ్యాప్టో చైర్మన్ విజయరామరాజు, జనరల్ సెక్రటరీ జి.ప్రకాశం తదితరులు పాల్గొన్నారు.