
అమెరికా పన్నుతో ఆక్వా రైతు కుదేలు
పాలకొల్లు సెంట్రల్: అమెరికా విధించిన 25 శాతం పన్నుతో ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీభగవాన్‌రాజు అన్నారు. శనివారం మండలంలోని పూలపల్లిలో ఎస్‌ఎస్‌ఎస్ కల్యాణ మండపంలో విలేకర్ల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమెరికా పన్నుల భారంతో ఆక్వా కంపెనీలు కొనుగోలు ధరల్లో రూ.40 నుంచి రూ.50 ధరను తగ్గించేశారన్నారు. దీంతో ఆక్వా సాగు అంటే రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. సరుకు లేకపోవడంతో గత 20 రోజులుగా వంద కౌంట్ రూ.260 నుంచి రూ.270 వరకూ కొన్నారని.. ఆమెరికా సుంకం సాకుతో వంద కౌంట్‌కు రూ.20 తగ్గించి కొంటున్నారన్నారు. మిగిలిన కౌంట్‌కు మాత్రం రూ.50 తగ్గించి కొంటున్నారన్నారు. ఇప్పటికే ఆక్వా రైతులు చాలా నష్టపోయారని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆక్వా ఫీడ్ కంపెనీలు, ప్రాసెసింగ్ యూనిట్లతో సమావేశం ఏర్పాటుచేసి ఆక్వా రైతులకు న్యాయం చేయాలన్నారు. భవిష్యత్‌లో రాష్ట్రంలో రైతులు ఆక్వాకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. వరి లాగా ఆక్వా రైతులకు కూడా మద్దతు ధర ప్రకటించి ఆదుకోవాలని అన్నారు. ఆక్వా రైతులపై రాష్ట్ర ప్రభుత్వానికి సరైన శ్రద్ధ లేదన్నారు. ఆక్వా రైతులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తే ప్రభుత్వానికి మంచిదని అన్నారు. కార్యక్రమంలో బోణం చినబాబు, అంగర వరప్రసాద్, దాట్ల సోంబాబు, జగ్గురోతు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.