
ప్రజలపై విద్యుత్ భారం
భీమవరం: విద్యుత్ స్మార్ట్ మీటర్లు అమర్చడాన్ని తక్షణం ఆపాలని స్మార్ట్ మీటర్ల వ్యతిరేక ఐక్యవేదిక రాష్ట్ర నాయకుడు సీహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. పట్టణంలోని చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో శనివారం ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు నమ్మకద్రోహం చేస్తుందని గత ప్రభుత్వంలో అదానీ ఒప్పందాలను వ్యతిరేకించి నేడు అదే పద్ధతి అవలంభించడం దారుణమన్నారు. ఎన్నికల్లో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చి వాటిని విస్మరించి ప్రజలపై మరిన్ని భారాలు వేయడానికి సిద్ధపడుతుందని విమర్శించారు. రైతులకు ఇస్తామన్న భరోసా రూ.3,500 కోట్లు అయితే విద్యుత్ చార్జీల పేరుతో ప్రజలపై వేసే భారం సుమారు రూ.12 వేల కోట్లని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రూ ఆప్, సర్దుబాటు చార్జీల పేరుతో కరెంటు చార్జీలు పెంచుతున్న ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు కోసం అదే బిల్లును అడ్డం పెట్టుకుని సంక్షేమ పథకాలకు దూరం చేస్తుందన్నారు. ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఈ నెల 5న రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ కార్యాలయాల వద్ద నిరసన చేయాలని ఐక్యవేదిక పిలుపునిస్తున్నట్లు చెప్పారు. ఏఐటీయుసీ జిల్లా కార్యదర్శి కొనాల భీమారావు, సీఐటీయు జిల్లా నాయకుడు బి.వాసుదేవరావు, అఖిల భారత కిసాన్ సభ నాయకుడు లంక కృష్ణమూర్తి, సీఐటీయు జిల్లా అధ్యక్షుడు జేఎన్వీ గోపాలన్, చింతకాయలు బాబురావు తదితరులు పాల్గొన్నారు.