కూటమి పాలనపై ప్రజల్లో వ్యతిరేకత
తణుకు అర్బన్: కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, ప్రజలంతా మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సుభిక్ష పాలనపై చర్చించుకుంటున్నారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శనివారం పార్టీ పట్టణ కమిటీ ఏర్పాటుపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా సూపర్ సిక్స్ హామీలను అమలు చేయపోవడంపై ప్రజలు చీదరించుకుంటున్నారని గుర్తుచేశారు. జగన్ పారదర్శక పాలన అందించారని చంద్రబాబును నమ్మి మోసపోయామంటూ ప్రజలు గగ్గోలు పెడుతున్నారని అన్నారు. గతంలో ఏడాదికి రెండు, మూడుసార్లు అర్హులకు ఏదోక పథకం రూపంలో డబ్బులు అందేవని, ఇప్పుడు పెంచిన రూ.వెయ్యి పింఛను తప్ప మిగిలిన పథకాలు ఏమీ అమలుచేయకపోవడంతో ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లలేక ఇళ్లకే పరిమితమవుతున్నారని, రానున్న రోజుల్లో ఎమ్మెల్యేల ఇళ్లను ప్రజలు ముట్టడించే పరిస్థితి వస్తుందని దుయ్యబట్టారు. శ్రేణులంతా పార్టీ బలోపేతానికి పాటుపడాలని, పార్టీ కోసం కష్టపడే ప్రతిఒక్కరిని గుర్తుపెట్టుకుంటానని అన్నారు.
వచ్చేవి మంచి రోజులు
జగన్ హయాంలో ప్రతి కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుందని, ముఖ్యంగా మహిళలు సంక్షేమ లబ్ధితో చిన్నపాటి వ్యాపారాలు చేసుకుని బలోపేతం అయ్యారని ఏలూరు పార్లమెంట్ ఇన్‌చార్జి కారుమూరి సునీల్‌కుమార్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కూటమి నేతలు వైఎస్సార్‌సీపీ శ్రేణులను దాడులు, కేసులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజల్లో తిరుగుబాటు మొదలవుతుందని, రానున్న రోజులన్నీ మంచి రోజులేనని స్పష్టం చేశారు. పార్టీ కోసం ప్రతి ఒక్కరూ శ్రమించాలని, జగన్ చేసిన మంచిని ప్రజలకు తెలియజేస్తూ కూటమి అక్రమాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ పట్టణ కమిటీ ఎన్నికపై నాయకులు కసరత్తు చేశారు. పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, పంచాయతీరాజ్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారాం, లీగల్ సెల్ సభ్యుడు వెలగల సాయిబాబారెడ్డి, జిల్లా సెక్రటరీ ఆర్గనైజేషన్ యిండుగపల్లి బలరామకృష్ణ, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పొట్ల సురేష్, మెహర్ అన్సారీ, బెజ్జవరపు హేమశ్రీ, నూకల కనకదుర్గ, మంగెన సూర్య, నత్తా కృష్ణవేణి, చోడే గోపీకృష్ణ, కారుమంచి యోహాన్, పెనుమాక రాజేష్, కర్రి గంగాధర అప్పారావు, కొత్తపల్లి చరణ్, లారెన్స్ ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు


