బుల్లెట్టు.. వీరి టార్గెట్టు
తణుకు అర్బన్: అంతర్రాష్ట్ర బైక్ దొంగలను తణుకు రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తాడేపల్లిగూడెం డీఎస్పీ డి.విశ్వనాఽథ్, రూరల్ సీఐ బి.కృష్ణకుమార్ చోరీలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాత్రి సమయాల్లో ఇళ్ల ముందు పెట్టిన వాహనాలను మాయం చేస్తున్న దొంగతనాలకు సంబంధించి తణుకు పాతవూరుకు చెందిన గుడాల లక్ష్మీనారాయణ అలియాస్ లక్కీ, తణుకు మండలం కొమరవరం గ్రామానికి చెందిన బొంత రవితేజ, హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన దాసరి మణిబాబు అలియాస్ చింటులను సోమవారం తణుకులో అరెస్టు చేసి రూ.13.40 లక్షలు విలువైన 11 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు తణుకులో ఇటీవల జరిగిన మూడు బైక్ దొంగతనాలకు సంబంధించి జరిపిన విచారణలో భాగంగా అనుమానితులను అదుపులోకి తీసుకుని తెలంగాణలోని జీడిమెట్ల, సూరారం, కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని తణుకు రూరల్ పోలీస్‌స్టేషన్, పోడూరు, నిడదవోలు పోలీస్‌స్టేషన్‌ల పరిధిలోని చోరీలకు సంబంధించి బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వివరించారు. స్వాధీనం చేసుకున్న వాహనాల్లో బుల్లెట్ వాహనాలే అధికంగా ఉండడం, బుల్లెట్ వాహనాలే వీరి లక్ష్యంగా ఎంచుకున్నారని స్పష్టం చేశారు. నిందితుల ఆచూకీతోపాటు చోరీలకు సంబంధించిన వాహనాలను రికవరీ చేయడంలో కీలకంగా వ్యవహరించిన తణుకు రూరల్ ఎస్సై కె.చంద్రశేఖర్, ఏఎస్సై పి.సంగీతరావు, హెడ్ కానిస్టేబుల్ బి.శ్రీనివాస్, కానిస్టేబుళ్లు ఎస్‌కే అన్వర్, ఎం.శ్రీనివాస్, వి.మాధవరావు, ఎస్.భాస్కరాచారిలను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
అంతర్రాష్ట్ర బైక్ దొంగల అరెస్టు
రూ.13.40 లక్షల విలువైన 11 బైక్‌ల స్వాధీనం
వివరాలు వెల్లడించిన డీఎస్పీ విశ్వనాథ్


