ట్రిపుల్‌ఐటీ విద్యార్థులకు అవగాహన సదస్సు
నూజివీడు: ట్రిపుల్ ఐటీ మెటలర్జికల్ విద్యార్థులు ప్రదర్శిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, నేర్చుకోవాలనే ఆసక్తి అభినందనీయమని మురుగప్ప అసోసియేట్ ఉపాధ్యక్షుడు, టెక్నికల్ హెడ్ సూర్యనారాయణ అన్నారు. స్థానిక ట్రిపుల్‌ఐటీలో మురుగప్ప గ్రూపు ఆధ్వర్యంలో ఎంఎంఈ విద్యార్థులకు సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సూర్యనారాయణ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థులు పరిశ్రమల అంచనాలను ప్రారంభదశలోనే తెలుసుకోవడానికి సాయపడతాయన్నారు. మురుగప్ప గ్రూపు హెచ్‌ఆర్ అండ్ సేఫ్టీ హెడ్ అరుణాచలం మాట్లాడుతూ ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి పరిశ్రమలకు ఉపయోగపడేలా వారిలో నైపుణ్యాలను పెంపొందించడానికి తగిన శిక్షణ ఇస్తామన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, ఎంఎంఈ, కెమికల్ ఇంజినీరింగ్ అధ్యాపకులు పాల్గొన్నారు. ఎంఎంఈ విద్యార్థులకు ఉత్తమ భవిష్యత్ కోసం నూతన మిశ్రమలోహాలు అనే అంశంపై వర్క్‌షాపు నిర్వహించారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్య కోటేశ్వరరావు విద్యార్థులకు అనేక అంశాలపై అవగాహన కల్పించారు.
నరసాపురం రూరల్: పేరుపాలెం బీచ్‌లో పర్యాటకుల భద్రతను మెరుగుపరచడానికి డ్రోన్ల వినియోగం విప్లవాత్మక మార్పని, వీటి సహకారంతో సముద్ర తీరాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు వేగంగా సహాయం చేసేందుకు వీలు పడుతుందని ఎస్సై జి.వాసు అన్నారు. మొగల్తూరు మండలంలోని పేరుపాలెం సౌత్, కేపీ పాలెం సౌత్ గ్రామాలలో బీచ్‌లో పర్యాటకుల రక్షణ కోసం సమకూర్చిన డ్రోన్‌ను ప్రొఫెసర్ జయశంకర్ ఆధ్వర్యంలో సిబ్బంది సోమవారం పరిశీలించారు. ప్రొఫెసర్ జయశంకర్ మాట్లాడుతూ రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గమనిస్తూ, ప్రమాదకరమైన ప్రాంతాలకు పర్యాటకులు వెళ్లకుండా హెచ్చరించవచ్చన్నారు. దాతలు అందే కాశీ విశ్వేశ్వరరావు రూ.5 లక్షలు, పోలిశెట్టి శ్రీనివాస్ రూ.లక్ష రూపాయలు విరాళంగా అందించిన నిధులతో సమకూర్చిన డ్రోన్‌ను బీచ్‌లో ఎగరవేసి పరిశీలించారు.
ట్రిపుల్‌ఐటీ విద్యార్థులకు అవగాహన సదస్సు


