రాట్నాలమ్మ తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తి
పెదవేగి: మండలంలోని రాట్నాలకుంట గ్రామంలో ఉన్న రాట్నాలమ్మ వారి తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతిఏటా ఎంతో అట్టహాసంగా నిర్వహించే ఈ తిరునాళ్లకు జిల్లా నుంచే కాక రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారు. ఏప్రిల్ 12 నుంచి 16 వరకు ఈ తిరునాళ్ల జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయం వద్ద ఈఓ ఎన్.సతీష్, చైర్మన్ మన్నే శ్రీనివాసరావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులకు ఇబ్బంది లేకుండా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అలాగే ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన భారీ లైటింగ్ సెట్టింగ్‌లు ఆకర్షిస్తున్నాయి. శనివారం నుంచి మూడు రోజుల పాటు రాత్రి సమయాల్లో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అలాగే 16న మధ్యాహ్నం భారీ అన్న సమారాధన నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
రేపు జంగారెడ్డిగూడెంలో ఉద్యోగ మేళా
జంగారెడ్డిగూడెం: స్థానిక శ్రీరామచంద్ర విద్యాసంస్థల్లో ఆదివారం ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు శ్రీరామచంద్ర విద్యా సంస్థల చైర్మన్ బీవీ కృష్ణారావు శుక్రవారం విలేకరులకు తెలిపారు. ప్రముఖ ఫార్మా కంపెనీ మెట్రోకెమ్ ఏపీఐ ప్రైవేట్ లిమిటెడ్ వైజాగ్, హైదరాబాద్ శాఖల్లో ఉన్న 300 ఖాళీలను ఈ మేళాలో భర్తీ చేస్తుందని వివరించారు. పడోతరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన ఆసక్తి ఉన్న అభ్యర్థులు మేళాకు హాజరుకావాలని కోరారు. మరిన్ని వివరాలకు 87126 35899, 87126 87497, 87126 11847 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.
స్విమ్మింగ్ కోచ్ గణేష్‌కు అరుదైన గుర్తింపు
ఏలూరు రూరల్: ఏలూరు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ స్విమ్మింగ్ కోచ్ బలగా గణేష్ పాక్ జలసంధి ఈదేందుకు అనుమతులు సాధించాడు. ఈ నెల 17, 18 తేదీల్లో శ్రీలంక, భారతదేశం సరిహద్దుల మధ్య 31 కిలోమీటర్ల మేర సముద్రంలో పాక్ జలసంధిలో ఈత కొట్టనున్నాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఈ గుర్తింపు సాధించిన మొట్టమొదట తెలుగు పారా స్విమ్మర్‌గా అరుదైన ఘనత సాదించాడు. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ రవినాయుడు, డీఎస్‌ఏ చీఫ్‌కోచ్ శ్రీనివాసరావుతో పాటు పలువురు శిక్షకులు పోటీ దిగ్విజయంగా పూర్తి చేయాలని ఆయనకు అభినందనలు తెలిపారు.
రాట్నాలమ్మ తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తి


