ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలతో ఏలూరు పోలీసు శాఖలోని హైవే మొబైల్ వాహనాలకు జీపీఆర్‌ఎస్ అమర్చినట్లు ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్‌కుమార్ తెలిపారు. ఏలూరు జిల్లాలో రహదారి భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని.. ఈ నేపథ్యంలో సిబ్బంది సేవలను మరింత సమర్ధవంతంగా వినియోగించుకునేందుకు జీపీఆర్‌ఎస్ ట్రాకింగ్ సిస్టమ్ అమర్చినట్లు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఏలూరు జిల్లాలోని 8 హైవే మొబైల్ వాహనాలకు జీపీఆర్‌ఎస్ ఏర్పాటు చేశామని చెప్పారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ హైవే మొబైల్ వాహనాలను పర్యవేక్షించటంతోపాటు ఏదైనా అత్యవసర సమయాల్లో తక్షణమే స్పందించేలా అవకాశం లభిస్తుందని డీఎస్పీ చెప్పారు. సిబ్బందికి రేడియం జాకెట్లు, బేటన్స్ అందజేశామని, మరింత సౌకర్యాలు కల్పిస్తూ విధులు సక్రమంగా నిర్వర్తించేలా చర్యలు చేపట్టామని తెలిపారు. జాతీయ రహదారుల్లో మద్యం సేవించి వాహనాలు నడపటం, మితిమీరిన వేగంతో వెళ్ళే వాహనాలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు చేపట్టేలా శ్రద్ద వహిస్తున్నామని స్పష్టం చేశారు. ఏదైనా అత్యవసర సమయాల్లో హైవే మొబైల్, పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 83329 59175 లేదా డయల్ 112కు ఫోన్ చేయాలని ఏలూరు డీఎస్పీ సూచించారు.
బెల్టు షాపు నిర్వాహకుడి అరెస్ట్
పెనుగొండ: మండలంలోని తామరాడలో బెల్ట్ షాపు నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని, ఆరు మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ ఎస్.మణికంఠ రెడ్డి తెలిపారు. ఆదివారం జరిగిన ఈ దాడిలో గుబ్బల జ్ఞానేశ్వరరావు(50)ను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. దాడుల్లో ఎస్సై ఆర్ మధుబాబు, హెచ్‌సీ శ్రీమన్నారాయణ, కానిస్టేబుల్ నాగరాజు పాల్గొన్నారు.