తాడేపల్లిగూడెం (టీఓసీ): బలుసులమ్మ మహాకుంభాభిషేక పూర్వక జాతర మహోత్సవాలు సందర్భంగా శుక్రవారం అమ్మవారికి పసుపు కొమ్ములతో అర్చన చేశారు. అనంతరం అష్టలక్ష్మి ఆరాధన పూర్వక సామూహిక సౌభాగ్య కుంకుమ పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని వందలాదిగా మహిళలు ఈ పూజలలో పాల్గొన్నారు. సాయంత్రం మూలమంత్ర హోమాలు, లక్ష్మీహోమం, రుద్ర హోమాలు, పల్లకి ఉత్సవం ఘనంగా చేశారు. ఏర్పాట్లను శ్రీరంగం అంజి పర్యవేక్షించారు.
తాడేపల్లిగూడెం: యువత ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని శాప్ చైర్మన్ ఎ.రవినాయుడు పిలుపునిచ్చారు. వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో శుక్రవారం 12వ అంతర్ కళాశాల క్రీడా పోటీలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రవినాయుడు మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమ శిక్షణ, జట్టు భావనను పెంపొందిస్తాయన్నారు. ఉద్యానవర్సిటీ వీసీ డాక్టర్ కె.ధనుంజయరావు మాట్లాడుతూ విద్యార్థుల సమగ్రాభివృద్ధిలో క్రీడలకు సముచిత స్థానం ఇవ్వాలన్నారు. ఈ పోటీల్లో ఉద్యాన విశ్వ విద్యాలయానికి అనుబంధంగా ఉన్న ఎనిమిది కళాశాలల నుంచి సుమారు 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అథ్లెటిక్స్ సహా 25కు పైగా ట్రాక్ , ఫీల్డ్ ఈవెంట్లు మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. ముందుగా విద్యార్థులు ఫ్లాగ్ మార్చ్ చేశారు. కార్యక్రమంలో డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ సి.మధుమతి, డీన్ ఆఫ్ హార్టీకల్చర్ డాక్టర్ ప్రసన్నకుమార్, ఎస్.సూర్యకుమారి, విజయపద్మ, రామానందం, రిజిస్ట్రార్ మాధవి, సి.రూత్ తదితరులు పాల్గొన్నారు.


