భీమవరం: జిల్లాలోని సహకార సంఘాల అధ్యక్షులు, సిబ్బంది జిల్లా సహకార అధికారి ఎస్.మురళీకృష్ణ, జిల్లా పౌరసరఫరా శాఖ మేనేజర్ ఎం డి ఇబ్రహీంను కలిసి సమస్యలపై విన్నవించారు. ధాన్యం కొనుగోలు సందర్భంగా సహకార సంఘాలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా సంచుల పంపిణీ, రవాణా బాధ్యతల నుంచి సంఘాలను తప్పించాలని కోరారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన కమీషన్ బకాయిలను, రవాణా చార్జీలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం వినతిపత్రాన్ని ఇబ్రహీంకు అందించారు.
చేపల పెంపకంలో యాజమాన్య పద్ధతులు పాటించాలి
ఉండి : మండలంలోని ఎన్నార్పీ అగ్రహారం కృషి విజ్ఞాన కేంద్రంలో చేపల పెంపకంపై ఏడు రోజుల పాటు శిక్షణా కార్యక్రమాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ డాక్టర్ ఎన్.మల్లికార్జునరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీఈడీఏ డిప్యూటీ డైరెక్టర్ గోపాల్‌ఆనంద్ మాట్లాడుతూ ఎంపీఈడీఏ చేపల రొయ్యల ఎగుమతికి అవశాలు, చేపలపెంకంలో ప్రత్యామ్నాయ జాతులైన గిఫ్ట్ తిలాపియా, పండుగొప్ప, పాంపెనో, కోబియా వంటి జాతుల గురించి వివరించారు. కార్యక్రమంలో శిక్షణా కోర్సు ఇన్‌చార్జ్ డాక్టర్ ఎ.శ్రీనివాస్ చేపల పెంపకంలో మెళకువలు,వాటి గుణగణాలపై వివరించారు.
ఏలూరు రూరల్: స్థానిక శనివారపుపేట బాలఅయ్యప్పస్వామి ఆలయం వద్ద జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ సభ్యులు శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఏలూరు జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా కె.మణిశంకర్, ఉపాధ్యక్షుడిగా ఎం. తులసిసాయి, కార్యదర్శిగా జీఎస్‌ఎస్ పవన్‌కుమార్, జాయింట్ సెక్రటరీగా కె.శ్రీకాంత్, కోశాధికారిగా ఎం.అనిల్‌కుమార్‌తో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.
ఏలూరు (టూటౌన్) : జిల్లాలో రైతులు పండిస్తున్న లేదా తయారు చేయుచున్న సేంద్రియ సహజ సిద్ధమైన ఉత్పత్తులు రైతు వివరాలను శ్రీఏలూరు రైతు సంపద్ఙ ఈ పోర్టల్‌లో పొందుపరుస్తున్నామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి షేక్ హబీబ్ భాష శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ పోర్టల్‌ను వినియోగించుకోవాలని కోరారు. ఈ పోర్టల్‌లో సేంద్రియ, సహజ సిద్ధమైన వివిధ రకాల బియ్యం, తేనే, పసుపు, మిరియాలు, పచ్చళ్లు, గృహ వినియోగ వస్తువులు ఉంచుతామని స్పష్టం చేశారు.


