నిషేధిత మందులు.. యథేచ్ఛగా అమ్మకాలు | - | Sakshi
Sakshi News home page

నిషేధిత మందులు.. యథేచ్ఛగా అమ్మకాలు

Published Sun, Mar 23 2025 12:30 AM | Last Updated on Sun, Mar 23 2025 12:36 AM

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నిషేధిత మందుల అక్రమాలపై విజిలెన్స్‌ అధికారులు కొరడా ఝుళిపించారు. పక్కా సమాచారంతో ఏకకాలంలో దాడులు చేయగా.. ఊహించని స్థాయిలో అక్రమాలు వెలుగుచూశాయి. లైంగిక సామార్థ్యాన్ని పెంచే మందులు, గర్భవిచ్ఛిత్తి, మత్తు కలిగించే మందులు పెద్ద మొత్తంలో పట్టుబడ్డాయి.
● జిల్లాలో ఔషధ నియంత్రణ శాఖ అధికారుల దాడులు ● లైంగిక సామర్థ్యం పెంచే మందులు భారీ ఎత్తున సీజ్‌ ● కాలం చెల్లిన మందులపై స్టిక్కర్లు అంటించి విక్రయాలు

తణుకు అర్బన్‌: జిల్లాలో పలు మందుల దుకాణాల్లో నిషేధిక డ్రగ్స్‌ అమ్ముతున్నారనే సమాచారంతో జరిపిన దాడుల్లో విస్తుగొలిపే విషయాలు వెలుగుచూశాయి. ఈ నెల 21న తణుకు నియోజకవర్గంలో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించగా.. నిషేధిత మందులతో పాటు.. కాలం చెల్లిన మందులకు స్టిక్కర్లు అంటించి అమ్ముతున్న వైనం వెలుగుచూసింది. ఈ నిషేధిత మందుల్లో లైంగిక సామర్థ్యాన్ని పెంచే మందులతోపాటు మత్తు కలిగించేవి, గర్భస్రావం మందులున్నాయి. తణుకు నియోజకవర్గంలోని అత్తిలిలో సత్యకృష్ణ మందుల దుకాణంలో నిషేధిత మందులతోపాటు కాలం చెల్లిన మందుల నిల్వను అధికారులు కనుగొన్నారు. ఈ దుకాణాన్ని మూసివేసి లైసెన్స్‌ రద్దుకు సిఫార్సు చేశారు. తణుకులోని తంగిరాల వారివీధిలో పెంజర్ల నాగేశ్వరరావు కొంతకాలంగా నిషేధిత మందుల్ని రావులపాలెం నుంచి కొని స్థానికంగా అధిక ధరలకు అమ్మడాన్ని విజిలెన్స్‌ అధికారులు గుర్తించి దాడి చేసి పట్టుకున్నారు. అధిక శాతం లైంగిక సామర్థ్యాన్ని పెంచే మందుల విక్రయాలు తణుకు పరిసర ప్రాంతాల్లో జోరుగా సాగుతున్నాయని విక్రయదారుడు తెలపడం విశేషం. నాగేశ్వరరావు తణుకులోని పలు దుకాణాలకు ఈ మందులు సరఫరా చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు.

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి తాడేపల్లిగూడెం, తణుకు, అత్తిలి, ఏలూరులో పలు దుకాణాల్లో అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నిషేధిత మందుల విక్రయాలకు సంబంధించి రూ.కోట్ల మేర లావాదేవీలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. నరసాపురం డివిజన్‌లో సుమారుగా 800, భీమవరం డివిజన్‌లో 600కు పైగా మందుల దుకాణాలు ఉన్నాయి., కొన్ని దుకాణాల్లో నిషేధిత మందులు విక్రయాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దాడుల విషయం తెలియడంతో అక్రమార్కులు జాగ్రత్త పడిపోయారు. తణుకులో ఒక ఇంట్లో నిషేధిత మందులు విక్రయాలకు సంబంధించి సుమారు రూ.6 లక్షల వరకు మందులు కొనుగోలు చేసినట్లు తెలిసింది. రావులపాలెంకు చెందిన బచ్చు సుబ్బారావు బ్యాంకు ఖాతాకు ఫోన్‌ పే ద్వారా పంపినట్లు విజిలెన్స్‌ అధికారులు ఆధారాలు సేకరించారు.

నిషేధిత మందులతో ఆరోగ్యంపై ప్రభావం

లైంగిక సామర్థ్యాన్ని పెంచే మందుల వల్ల గుండెకు రక్తం సరఫరా చేసే ధమనులు, ఊపిరితిత్తులపై ప్రభావం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ మందు అధిక వాడకం వల్ల హార్ట్‌ అటాక్‌ వచ్చే ప్రమాదం పొంచి ఉంటుంది. గర్భస్రావం కోసం ఉపయోగించే మందులు ఒక్కోసారి ప్రాణాల మీదకు తెస్తాయని, భవిష్యత్తులో తీవ్రం ప్రభావం చూపిస్తాయని చెబుతున్నారు. మత్తు మందు వాడకంతో కొన్నాళ్లకు నరాల సమస్యలు, నిద్రలేమి సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.

ఔషధ నియంత్రణ శాఖ నిర్లక్ష్యం

విజిలెన్స్‌ అధికారులు రంగంలోకి దిగితే తప్ప నిషేధిత మందుల వినియోగంపై ఔషధ నియంత్రణ శాఖ పర్యవేక్షణ లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏ దుకాణంలో ఏ మందులు ఉన్నాయి.. ఏ దుకాణంలో నిబంధనలు పాటిస్తున్నారనే విషయంపై ఔషధ నియంత్రణ శాఖ అధికారులకు స్పష్టత ఉంటుంది. కొన్ని రకాల కారణాలతో దాడులు చేయడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా ఔషధ నియంత్రణ శాఖ ఉన్నతాధికారులు పర్యవేక్షించి తరచూ దుకాణాలపై దాడులు చేస్తే ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చు.

నిషేధిత మందులు.. యథేచ్ఛగా అమ్మకాలు 1
1/2

నిషేధిత మందులు.. యథేచ్ఛగా అమ్మకాలు

నిషేధిత మందులు.. యథేచ్ఛగా అమ్మకాలు 2
2/2

నిషేధిత మందులు.. యథేచ్ఛగా అమ్మకాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement