బుట్టాయగూడెం: గుర్తు తెలియని వ్యక్తులు వైఎస్సార్ సీపీ కార్యకర్తపై మారణాయుధాలతో దాడి చేసి పరారీ కావడం జీలుగుమిల్లి మండలం తాటాకులగూడెంలో కలకలం రేపింది. రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న బాధితుడిని తెల్లవారుజామున కుటుంబీకులు గమనించి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త గంథం బోసుబాబు సోమవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అతడి తలపై దాడి చేసి పరారయ్యారు. తెల్లవారుజామున కుమారుడు అనూప్‌శక్తి గమనించి విషయాన్ని తల్లి శాంతికుమారికి చెప్పడంతో ఆమె వెంటనే తన మరిది వీరాంజనేయులు, కడెల్లి చిన్ని అనే వారికి తెలియజేసింది. వెంటనే బంధువులు రక్తపు మడుగులో ఉన్న బోసుబాబును తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఖమ్మం ఆస్పత్రికి రిఫర్ చేయడంతో అక్కడికి తరలించి వైద్యం అందిస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐలు బి. వెంకటేశ్వరరావు, బాల సురేష్, ఎస్సైలు నవీన్ కుమార్, చంధ్రశేఖర్ దర్యాప్తు చేపట్టారు. బోసుబాబు ఇంటికి జాగిలాలను రప్పించి తనిఖీలు చేశారు. క్లూస్ టీమ్ కూడా వచ్చి వివరాలు సేకరించారు. కాగా అసలు ఏం జరిగిందనే దానిపై పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.
దోషులను కఠినంగా శిక్షించాలి
ఇటీవల జీలుగుమిల్లిలో జరిగిన జగదాంబ అమ్మవారి తిరుణాళ్లలో అవకతవకలపై ఒక పత్రికలో వచ్చిన వార్తను వాట్సాప్ గ్రూప్‌లో తన భర్త బోసుబాబు సెండ్ చేసినట్లు అతని భార్య శాంతకుమారి తెలిపారు. ఈ విషయమై జగదాంబ ఆలయ కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు ఫోన్ చేసి తన భర్తను నానా దుర్భాషలాడి ఎప్పటికై నా తన భర్తను నరికి చంపుతానని హెచ్చరించారని ఈ విషయం తన భర్త తనతో చెప్పినట్లు తెలిపారు. దీంతో ఈ విషయంపై నాలుగురోజుల క్రితం జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఆమె చెప్పారు. ఈలోపే తన భర్తపై దాడి జరిగిందని దీనిపై విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రాత్రివూట ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తిపై మారణాయుధాలతో దాడి
దాడి చేసి పరారైన గుర్తు తెలియని వ్యక్తులు
తాటాకులగూడెంలో కలకలం
బాధితుడి భార్య ఫిర్యాదుతో పోలీసుల దర్యాప్తు
వైఎస్సార్ సీపీ కార్యకర్తపై దాడి