ఆలయ విశిష్టతకు ముప్పు! | - | Sakshi
Sakshi News home page

ఆలయ విశిష్టతకు ముప్పు!

Mar 19 2026 10:26 AM | Updated on Mar 19 2026 10:26 AM

క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో షెడ్ల నిర్మాణంపై నిరసన

క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో షెడ్ల నిర్మాణంపై నిరసన

షెడ్‌ నిర్మించనున్న ప్రాంతం(ఫైల్‌)

పాలకొల్లు సెంట్రల్‌: పాలకొల్లులోని ప్రముఖ పంచారామ క్షేత్రమైన శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న పరిణామాలపై భక్తులు, పాలకమండలి సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ నిబంధనలకు, పురావస్తు శాఖ నియమాలకు విరుద్ధంగా ధ్వజస్థంభం వద్ద షెడ్ల నిర్మాణం జరుగుతోంది. సాధారణంగా ఆలయంలో చిన్న మార్పు చేయాలన్నా అనేక అనుమతులు కావాలని చెప్పే అధికారులు.. దాతలు ముందుకు రాగానే ఎలాంటి అనుమతులు లేకుండానే పనులు ప్రారంభించేశారనే విమర్శలు వస్తున్నాయి. పాలకమండలిలో ఉన్న సభ్యులకు కనీస సమాచారం ఇవ్వకుండానే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని సమాచారం.

ఆగమేఘాల మీద నిర్మాణం ఎందుకు?

క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో గాలిగోపురం, ధ్వజస్తంభం మధ్యలో ఖాళీ స్థలం ఉంది. గోపురం నుంచి లోపలకు వెళ్తుంటే రెండు వైపులా రెండు మండపాల మధ్యలో శివయ్య విగ్రహం, దాని ముందు నందీశ్వరుడు, వెనుక ధ్వజ స్తంభం ఉంటుంది. రెండు మండపాలకు ఇరువైపులా వర్షం వచ్చినా క్యూలైన్‌లో నిలబడడానికి మూడు అడుగుల వెడల్పుతో షెడ్‌లు ఏర్పాటు చేశారు. అంతవరకూ బాగానే ఉంది. ఇప్పుడు మద్యలో కూడా షెడ్‌ నిర్మాణానికి ఆలయ అధికారులు, పాలకమండలి సభ్యులు ఓకే చెప్పేసి కొబ్బరి కాయలు కొట్టినట్లు తెలిసింది.

మంగళవారం రాత్రి అత్యవసరంగా పిలిపించి, కనీసం విషయం చెప్పకుండానే షెడ్‌ నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టించారని కొందరు పాలక మండలి సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ఈవో, మరికొందరు సభ్యులు తమ ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారని, ప్రశ్నిస్తే మంత్రి పేరు చెప్పి బెదిరిస్తున్నారని కూటమి నేతలు సైతం మండిపడుతున్నారు.

ఆలయ విశిష్టతకు ముప్పు?

ఈ కొత్త షెడ్డు నిర్మాణం వల్ల ఆలయ విశిష్టత దెబ్బతినే ప్రమాదం ఉందని భక్తులు భయపడుతున్నారు: ఆలయ ధ్వజ స్తంభం వద్ద షెడ్డు నిర్మాణం వల్ల ప్రధానంగా ఆలయం ముందు వెలుతురు ఉండదు. శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయం తరువాత పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో మాత్రమే మల్లన్న పాగా కడతారు. ఈ పాగా కనిపించేది ధ్వజ స్తంభం వద్ద మాత్రమే. ఇక్కడ షెడ్డు నిర్మాణం చేస్తే ఇక మల్లన్న పాగా ఎవరికి కనిపిస్తుంది. శ్రీరామనవమి సమయంలో గాలిగోపురం నుంచి సూర్య కిరణాలు నేరుగా శివలింగంపై పడతాయి. షెడ్‌ నిర్మాణం వల్ల ఇందుకు అవకాశం ఉండదు. మహాశివరాత్రి రోజున నందాదీపం వెలిగించినప్పుడు భక్తులు చేసే శిఖర దర్శనం సాధ్యం కాదు.

పురావస్తు శాఖ అధికారులను షెడ్డు నిర్మాణంపై ప్రశ్నించగా.. తమకు ఎలాంటి సమాచారం లేదని, అనుమతులు ఇవ్వలేదని చెబుతున్నారు. ఫోన్‌ చేసి నిర్మానం చేయవద్దని ఈవోకు చెబుతానన్నారు. ఐదు నెలల క్రితం కూలిపోయిన ఆలయ ప్రాకార గోడను పట్టించుకోని అధికారులు, ఈ షెడ్డు నిర్మాణంపై చూపిస్తున్న ఆత్రం వెనుక కారణాలు ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఆర్కియాలజీ డిపార్ట్‌మెంటు అనుమతులు కూడా లేవు. అయినా ఎందుకు వెళ్తున్నారో భక్తులకు అర్థం కావడం లేదు. ఆలయంలో ఏదైనా సమస్యపై ప్రశ్నిస్తుంటే మంత్రి వద్దకు వెళ్లి మన పార్టీ వాళ్లే ఏ పని చేయకుండా ప్రశ్నిస్తున్నారని, అడ్డుకుంటున్నారని కొందరు తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మంత్రి ఈ విషయంలో జోక్యం చేసుకుని ఆలయ పవిత్రతను, చారిత్రక సంపదను కాపాడాలని భక్తులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement