భీమవరం (ప్రకాశంచౌక్) : మస్కట్, ఒమన్ దేశంలో ఉపాధి నిమిత్తం వెళ్లి దురదృష్టవశాత్తు మరణించిన భారతీయుల కుటుంబాలకు మంజూరైన బీమా క్లెయిమ్, పరిహారానికి సంబంధించి ఇండియన్ ఎంబసీ ద్వారా అందిన చెక్కులను బుధవారం భీమవరం కలెక్టరేట్ చాంబర్‌లో కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. పెనుమంట్ర మండలం జుత్తిగకు చెందిన తాడి సూర్యనారాయణ రెడ్డి 2024 నవంబర్ 30న చనిపోగా వీరికి సంబంధించి కై ్లయిమ్ రూ.11,98,154 చెక్కును, భీమవరం మండలం సరిగుట్లపాడు గ్రామానికి చెందిన తిరుమాణి కృష్ణ 2023 అక్టోబర్ 28న చనిపోగా వారికి సంబంధించిన రూ.17,25,978 చెక్కును అందజేశారు.
భీమవరం : జిల్లా వ్యాప్తంగా బుధవారం 132 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన టెన్త్ పబ్లిక్ పరీక్షకు 98.46 శాతం విద్యార్థులు హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ తెలిపారు. హిందీ పరీక్షకు 22,858 మంది హాజరుకావాల్సివుండగా 353 మంది గైర్హాజరయ్యారన్నారు. ఎస్‌ఎస్‌సీ(ఏపీఓఎస్‌ఎస్) పబ్లిక్ పరీక్షకు 253 మందికి 215 మంది విద్యార్దులు హాజరయ్యారని 64 పరీక్షా కేంద్రాల్లో తనిఖీ నిర్వహించగా ఎక్కడా మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని నారాయణ తెలిపారు.
భీమవరం: భీమవరం టీడీపీలో ఆధిపత్యపోరు మరోసారి బయటపడింది. భీమవరం కొత్త బస్టాండ్ ఆవరణలో బుధవారం జరిగిన దివ్యాంగ శక్తి ప్రారంభ సభ ఇందుకు వేదికగా మారింది. ఈ కార్యక్రమంలో వేదికపైకి ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులును పిలిచిన తర్వాత టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథిని వేదికపైకి పిలిచారు. అనంతరం మాజీ ఎంపీ, భీమవరం నియోజకవర్గ ఇన్‌చార్జి తోట సీతారామలక్ష్మిని పిలవడం గొడవకు కారణమైంది. అధికారులకు ప్రొటోకాల్ తెలియదా అంటూ మండిపడి వేదికపైకి వెళ్లడానికి ఆమె నిరాకరించారు. దీంతో టీడీపీ నాయకులంతా ఆమె చుట్టూ చేరడం, రగడను కవర్ చేస్తున్న విలేకరులను పోలీసులు పక్కకు తోయడం గందరగోళంగా మారింది. జిల్లా అధికారులు సీతారామలక్ష్మికి నచ్చచెప్పి పొరపాటు జరిగిందంటూ వేడుకున్నా ఆమె ససేమిరా అనడంతో కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. చివరకు కలెక్టర్ సీహెచ్ నాగరాణి కలగజేసుకుని సీతారామలక్ష్మిని వేదికపైకి పిలవడమేగాక చేయిపట్టుకుని వేదిక ఎక్కించారు. టీడీపీలో ఇప్పటికే కొనసాగుతున్న ఆధిపత్యపోరు ఈ సంఘటనతో మరోసారి బయటపడింది.
జిల్లాలో 220 బస్సుల్లో..
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలోని 220 బస్సు సర్వీసుల్లో దివ్యాంగ శక్తి పథకం అమలు చేస్తామని కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో ఈ పథకాన్ని అందిస్తామని, దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఒంటిపూట బడులను పక్కాగా నిర్వహించాలని డీఈవో ఎం. వెంకట లక్ష్మమ్మ ఆదేశించారు. ఈ నెల 16వ తేదీ నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న నేపధ్యంలో పరీక్షా కేంద్రం లేని చోట ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ ఒంటిపూట బడులు నిర్వహించాలన్నారు. పరీక్షా కేంద్రం ఉన్న పాఠశాలలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకూ నిర్వహించాలని సూచించారు.


